కర్ణాటక మురుడేశ్వర్‌లోని కారవార బీచ్‌లో జనార్ధన్ అనే మత్స్యకారునికి ఒక కేజీ బరువు ఉండే యాంబర్ గ్రీస్ దొరికింది. మొదటి గ్రీస్‌ను చూసిన అతను తెల్ల రాయి అనుకున్నాడు. ఆకారం కొంత వింతగా ఉండడం వల్ల ఇంటికి తీసుకెళ్లాడు. ఇరుగు పొరగు వారికి చూపించి ఆరా తీయగా దాని విలువ సుమారు రూ. కోటికి పైగా ఉండవచ్చని తెలుసుకున్నాడు. అయితే మన దేశంలో ఆ పదార్థం విక్రయించడానికి అనుమతి లేదని స్నేహితులు చెప్పారు. దీంతో హోన్నవర్ డివిజన్ అటవీ అధికారి అయిన రంగనాథ్‌కు రాయిని అప్పగించాడు.
మురుడేశ్వర్ బీచ్‌లో దొరికిన యాంబర్ గ్రీస్ ఏంటి యాంబర్ గ్రీస్..?
యాంబర్ గ్రీస్ అనేది రాయిలా ఉండే ఓ ఘన పదార్థం. సముద్రంలో ఉండే తిమింగలాలు ఒక చోటు నుంచి మరొక ప్రాంతానికి వెళ్తుంటాయి. ఆ సమయంలో ఆహారంగా రకరకాల చేపలు, సముద్ర జంతువులను తింటూ ఉంటాయి. అలా తిమింగలాలు తిన్న ఆహారం కొన్ని సార్లు జీర్ణం కాదు. అది కొన్ని ఏళ్ల పాటు కడుపులోనే ఉండి పోతుంది. ఎప్పుడైనా ఓ సారి దానిని తిమింగలాలు వాంతి చేసుకుంటాయి. ఇలా అది బయటకు వస్తుంది అని మెరైన్ బయోలాజికల్ స్టడీస్ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ వివరించారు. దీన్ని అగ్నితో వేడి చేస్తే మొదట భరించలేని వాసన వస్తుందని తెలిపారు. ఆపై ఇది సువాసనలు వెదజల్లుతుందని పేర్కొన్నారు. దీనిని సుగంధాల తయారీ ఉపయోగిస్తారని చెప్పిన ఆయన.. ఈ కారణంగా ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుందని వివరించారు.
ఇదీ చూడండి:పరిమళాలతో జబ్బులు మాయంచేసే 'అరోమా థెరపీ'!