రైలులో RPF కానిస్టేబుల్ కాల్పులు.. ASI సహా నలుగురు మృతి Jaipur Express Firing : జయపుర-ముంబయి సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (12956)లో ఓ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్- RPF కానిస్టేబుల్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం 5.23 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఓ ఆర్పీఎఫ్ ఏఎస్ఐతో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది..చేతన్ కుమార్ అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సీనియర్, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ టీకా రామ్ మీనాను కదులుతున్న రైలులో తన ఆటోమెటిగ్ తుపాకితో కాల్చి చంపాడు. అనంతరం మరో బోగీలోకి వెళ్లి ముగ్గురు ప్రయాణికులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారు అక్కడిక్కడే మృతిచెందారు. బీ5 కోచ్‌లో ఈ ఘటన జరిగింది. కాల్పుల తర్వాత నిందితుడు రైలు లోంచి కిందకు దూకాడు.
గవర్నమెంట్ రైల్వే పోలీస్, ఆర్పీఎఫ్ అధికారుల సహాయంతో నిందితుడిని మీరా రోడ్డు వద్ద పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని.. బోరువాలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోమవారమే అతడిని కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
'మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా'
ఈ ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ నీరజ్ వర్మ స్పందించారు. 'ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎస్కార్టింగ్ డ్యూటీలో ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడని మాకు తెలిసింది. నలుగురిని కాల్చిచంపాడని సమాచారం అందింది. ఇది జరిగిన వెంటనే మా రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిసింది. మృతుల కుటుంబాలను కూడా సంప్రదించాము. మృతుల కుటుబాలకు ఎక్స్‌గ్రేషియా ఇస్తాము' అని తెలిపారు. ఆయన చెప్పినట్టే మరణించిన ASI టీకా రామ్ మీనా బంధువులకు పశ్చిమ రైల్వే ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రైల్వే సురక్ష కల్యాణ్ నిధి నుంచి రూ. 15 లక్షలు, అంత్యక్రియల ఖర్చులకు రూ. 20 వేలు, డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీగా కింద రూ. 15 లక్షలు, సాధారణ బీమా పథకం కింద రూ. 65 వేలు అందజేయనున్నట్లు తెలిపింది.
'దురదృష్టకరం'
'ఈరోజు ముంబయి-జయపుర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో దురదృష్టకర ఘటన జరిగింది. RPF కానిస్టేబుల్ చేతన్ కుమార్ తన సహోద్యోగి ASI టికారమ్ మీనాపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు ప్రయాణికులు కూడా మృతిచెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అతడు తన అధికారిక ఆయుధాన్ని ఉపయోగించి కాల్పులు జరిపాడు. నిందితుడిని అరెస్టు చేశారు. కాల్పులకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాము' అని పశ్చిమ రైల్వే సీపీఆర్ఓ తెలిపారు.