'రోజ్‌గార్ మేళా'లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన మరో 71 వేల మందికి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను అందించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లోని 45 ప్రాంతాల్లో నియామక పత్రాలు అందజేశారు.
దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం, యువతకు సాధికారత కల్పించటం సహా జాతీయాభివృద్ధిలో వారు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు.. అన్ని అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మోదీ. గత నెలలో ఇలాంటి మేళాలు భాజపా పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించామని మోదీ అన్నారు. ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల డబుల్ ప్రయోజనమని.. ఇలాంటి కార్యాక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తామని చెప్పారు.
అమృతోత్సవాల వేళ దేశ ప్రజలందరం కలిసి అభివృద్ధి చెందిన దేశంగా మారుద్దామని శపథం తీసుకున్నాం. ఈ లక్ష్య సాధనలో మీరంతా దేశానికి సారథులు కానున్నారు. కొత్త బాధ్యతలు చేపడుతున్న మీరంతా దేశ ప్రజలతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి, యుద్ధం వంటి ఈ కిష్టసమయాల్లో ప్రపంచవ్యాప్తంగా యువత ముందు కొత్త అవకాశాలకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆర్థికమాంద్యం రానుందని ప్రముఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో భారత్ తన ఆర్థిక సామర్థ్యాన్ని చూపేందుకు, కొత్త అవకాశాలను పెంచుకునేందుకు సువర్ణ అవకాశమని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది..
క్రితం నెలలో కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో జాబ్ మేళాలు నిర్వహించి నియామక పత్రాలు అందజేశామని ప్రధాని గుర్తు చేశారు. ' గత నెలలో మహారాష్ట్రలో, గుజరాత్లో వేలకొద్ది నియామక పత్రాలు అందించాం. అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ, చండీగఢ్‌లో కూడా జామ్ మేళాలు నిర్వహించి యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.