చెరువు మధ్యలో దాక్కున్న రౌడీని పట్టించిన డ్రోన్ కెమెరా Drone camera criminal arrest: సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత నేరస్థులను గుర్తించటం చాలా సులభమైంది. ఇప్పుడు వాటికి డ్రోన్ కెమెరాలు తోడయ్యాయి. పోలీసులకు దొరక్కుండా చెరువు మధ్యలోని పొదల్లో నక్కిన ఓ 'రౌడీ'ని డ్రోన్ కెమెరాలు పసిగట్టాయి. ఈ సంఘటన తమిళనాడు తెన్కాసి జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది..
తెన్కాసి జిల్లాకు చెందిన జకుల్ హమీద్ అనే వ్యక్తిపై పలు స్టేషనల్లో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఓ హత్యాయత్నం కేసులో పోలీసులు హమీద్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తెన్కాసి పచనాయకంపొట్టై ప్రాంతానికి వెళ్లి నివాసం ఏర్పరచుకున్నాడు. తన వద్దకు ఎవరూ రావొద్దని అక్కడి ప్రజలను బెదిరించాడు.
ఓ రోజు బీర్ మొహమ్మద్ అనే స్థానికుడు పశువులను మేపుతూ అటుగా వెళ్లగా పదునైన ఆయుధంతో అతనిపై జకుల్ హమీద్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బీర్ మొహమ్మద్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. హత్యాయత్నంపై సమాచారం అందుకున్న తెన్కాసి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. జకుల్ కోసం గాలింపు చేపట్టగా.. వారికి దొరకకుండా.. ఆ సమీపంలోని చెరువు వైపు వెళ్లి కనిపించకుండా పోయాడు.
చెరువు సమీపంలో జకుల్ను చూసినట్లు కొందరు మహిళలు పోలీసులకు చెప్పారు. చెరువులో నక్కినట్లు అంచనాకు వచ్చిన పోలీసులు.. ఉన్నతాధికారులతో సంప్రదించారు. డ్రోన్ కెమెరాను తెప్పించి గాలింపు చేపట్టారు. చెరువు మధ్యలో పొదల్లో నక్కిన జకుల్ హమీద్‌ను ఆ డ్రోన్ కెమెరా గుర్తించింది. దానిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి:'శ్రీవల్లి'ని వాయించిన ముంబయి పోలీసులు