Brij Bhushan Sharan Singh Bail : మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురిచేశారన్న కేసులో బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్ భూషణ్ బెయిల్ పిటిషన్నుదిల్లీ పోలీసులు వ్యతిరేకించని నేపథ్యంలో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయనతో పాటు WFI ఉప కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని వీరిని ఆదేశించింది. కేసును పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు.. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది.
కాగా, బ్రిజ్ భూషణ్‌తో పాటు WFI ఉప కార్యదర్శి వినోద్ తోమర్‌కు జులై 18న మధ్యంతర బెయిల్‌ను దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేయగా.. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు రెగ్యులర్ బెయిల్ కోసం మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. విచారణ సందర్భంగా దిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిజ్ భూషణ్ పిటిషన్‌ను తాము వ్యతిరేకించడం లేదని, అలాగని మద్దతు కూడా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని మాత్రమే తాను చెప్పగలనని కోర్టులో పేర్కొన్నారు.
బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేయగా.. ఈ కేసులో దిల్లీ పోలీసులు జులై 7న ఛార్జిషీట్ నమోదు చేశారు. ఈ అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. అనంతరం నిందితులకు సమన్లు జారీ చేసింది.