తెలంగాణ

telangana

ETV Bharat / bharat

IAS వర్సెస్ IPS.. ఇద్దరికీ ప్రభుత్వం షాక్.. పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ - Sindhuri spent Rs 1 to 2 crore on furniture

కర్ణాటకలో రచ్చకెక్కిన మహిళా సివిల్ సర్వెంట్లకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇద్దరినీ ట్రాన్స్​ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరికీ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. మరోవైపు, రూప భర్తను సైతం బదిలీ చేసింది బొమ్మై సర్కారు.

roopa-moudgil-rohini-sindhuri-transferred
roopa-moudgil-rohini-sindhuri-transferred

By

Published : Feb 21, 2023, 4:25 PM IST

Updated : Feb 21, 2023, 4:53 PM IST

సోషల్ మీడియాలో బహిరంగంగా కీచులాటకు దిగిన ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూప మౌద్గిల్​కు షాక్ తగిలింది. కర్ణాటక ప్రభుత్వం వారిద్దరిపై బదిలీ వేటు వేసింది. పోస్టింగ్ ఇవ్వకుండానే ట్రాన్స్​ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్​గా ఉన్న సింధూరి స్థానంలో బసవరాజేంద్రను నియమించింది కర్ణాటక సర్కారు. కర్ణాటక హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఉన్న రూప స్థానంలో.. డి.భారతిని నియమిస్తున్నట్లు ప్రకటించింది. రూప, సింధూరి ఇద్దరికీ ఎలాంటి కొత్త పోస్టింగ్ ఇవ్వలేదు. మరోవైపు, రూప భర్త మునీశ్ మౌద్గిల్​ను సైతం బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వే సెటిల్​మెంట్, ల్యాండ్ రికార్డుల విభాగానికి కమిషనర్​గా ఉన్న మునీశ్​ను.. సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమించింది.

మరోవైపు, ఇద్దరు అధికారిణులు ప్రవర్తించిన తీరుపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ సర్వీసులో ఉంటూ.. ఒకరిపై మరొకరు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసుకోవడం సరికాదని హితవు పలికింది. ఆల్ఇండియా సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని పేర్కొంటూ నోటీసులు పంపించారు సిబ్బంది వ్యవహారాల శాఖ అండర్​ సెక్రెటరీ జేమ్స్ తారకన్. ఈ అంశంపై మీడియాను ఆశ్రయించవద్దంటూ స్పష్టం చేశారు.

వివాదం ఏంటంటే?
ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియాలో రచ్చకెక్కారు ఈ ఇద్దరు సివిల్ సర్వెంట్లు. ఏకంగా రోహిణి ప్రైవేటు ఫొటోలను షేర్ చేశారు రూప. వీటిని ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులతో రోహిణి పంచుకున్నారని ఆరోపించారు. ప్రైవేటు ఫొటోలను వారికి షేర్ చేయడం వెనక మర్మం ఏంటని ప్రశ్నించారు. దీంతో పాటు పలు అవినీతి ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్న రోహిణి.. దాని గురించి బహిరంగంగా చెప్పుకోకుండా దాస్తున్నారని రూప ఆరోపించారు. రోహిణి అవినీతిపై విచారణ జరపాలంటూ సీఎస్​ను కలిసి ఫిర్యాదు చేశారు రూప. రోహిణి సైతం రూపకు వ్యతిరేకంగా సీఎస్​ను కలిశారు. తనపై రూప చేసిన ఆరోపణలను ఖండించారు.

రోహిణి సింధూరి

వివాదం ఎలా మొదలైందంటే?
రోహిణి స్వస్థలం ఏపీలోని నెల్లూరు కాగా.. రూప మౌద్గిల్ కర్ణాటకలోని దావణగెరె వాసి. గతంలో వీరిద్దరూ స్నేహితులేనని సమాచారం. ఈ మధ్య వీరిద్దరికి చెడినట్లు తెలుస్తోంది. గతంలో రోహిణి.. మైసూరు జిల్లా అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో అప్పటి మంత్రి మహేశ్​కు, రోహిణికి విభేదాలు వచ్చాయి. మహేశ్ భార్య ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని భవనం నిర్మించారన్న ఆరోపణలపై రోహిణి విచారణకు ఆదేశించారు. అయితే, అది ప్రభుత్వ భూమి కాదని తర్వాత తేలింది. దీంతో తనది పొరపాటు అని పేర్కొంటూ మహేశ్​కు లేఖ రాశారు రోహిణి. ఇటీవల మరో అధికారితో కలిసి మహేశ్​తో భేటీ అయ్యారు. దీనిపై ఐపీఎస్ అధికారిణి రూప స్పందిస్తూ.. ఇది నిబంధనలకు వ్యతిరేకం అని ఆరోపించారు. దీంతో వివాదం పెరిగి పెద్దదైంది.

రూప మౌద్గిల్

రోహిణి ఇటలీ నుంచి తన ఇంటి ఫర్నిచర్​ను తీసుకొచ్చారని, ఇందుకు డ్యూటీ కట్టకుండా తన ఇన్​ఫ్లుయెన్స్​ను ఉపయోగించుకున్నారని రూప ఆరోపించారు. కరోనా సమయంలో మైసూరులోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణంలోనూ అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. వీటిపై దర్యాప్తు చేయాలని సీఎస్​ను కోరారు. ఎన్నికల వేళ ఈ వివాదం తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇద్దరు సివిల్ సర్వెంట్లు సంయమనంతో వ్యవహరించాలని సోమవారం కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. ఇరువురికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సివిల్ సర్వెంట్లు ఇద్దరిపై వేటు పడింది.

Last Updated : Feb 21, 2023, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details