Roof Collapse Today : ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఘోరం జరిగింది. ఆలంబాగ్‌లోని పాత రైల్వే కాలనీలో ఇంటిపైకప్పు కూలడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులను సతీశ్ చంద్ర, అతడి భార్య సరోజినీ దేవి, పిల్లలు హర్షిత, హర్షిత్, అన్ష్‌లగా గుర్తించారు.
ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ..
అయితే విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని తూర్పు డీసీపీ హృదేశ్ కుమార్ తెలిపారు. శిథిలాల కింద సతీశ్ కుటుంబసభ్యులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కానీ అప్పటికే వారంతా చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు.
మృతుడు సతీశ్ చంద్ర.. తన కుటుంబంతో రైల్వే కాలనీలో నివసిస్తున్నారు. రైల్వే ఉద్యోగి అయిన అతడి తల్లి ఇటీవలే మరణించింది. దీంతో కారుణ్య నియమాకం ద్వారా సతీశ్‌కు ఉద్యోగం దక్కింది. ఇటీవలే సతీశ్ ఉద్యోగంలో చేరాడని.. ఇంతలో ఇలా జరగడం విషాదకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.