సుదీర్ఘ భారత స్వాతంత్య్ర సంగ్రామం (Azadi Ka Amrit Mahotsav)... భారత్‌కు బానిసత్వం నుంచే కాదు... ప్రపంచానికి ఆకలి నుంచి విముక్తి కల్పించేందుకూ ఉపయోగపడింది. సాయుధ మార్గంలో దేశానికి స్వేచ్ఛనివ్వాలని వెళ్లిన ఓ భారత విప్లవవీరుడు... ఆ ప్రయత్నంలో విఫలమైనా... సస్య విప్లవానికి నాంది పలికారు. తర్వాత నార్మన్ బోర్లాగ్‌లాంటివారికి దారి చూపారు.
డాక్టర్ పాండురంగ్ ఖన్కోజే... ఈ పేరు భారత్‌లో ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ మెక్సికోలో చిరపరిచితం. అలాగని ఆయన మెక్సికన్ కాదు. భారత స్వాతంత్య్ర సమర యోధుడు. మహారాష్ట్రలోని వార్ధాలో 1886లో పుట్టిన పాండురంగ్... కాలేజీ చదువు పూర్తయ్యే సమయానికి భారత్‌లో జాతీయోద్యమం పురుడుపోసుకుంటోంది. అప్పుడే బెంగాల్ విభజనతో దేశం అట్టుడుకుతోంది. 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న తన తాతయ్య స్ఫూర్తికి... తాజాగా బాలగంగాధర్ తిలక్ ప్రేరణ తోడవటంతో పాండురంగ్ ఉద్యమంలో దూకకుండా ఉండలేకపోయారు. తిలక్ సూచనతో... విదేశాల్లో పోరాట పంథాలను అధ్యయనం చేయటానికి జపాన్, చైనాలకు వెళ్లారు. 1906లో అనూహ్యంగా అమెరికా పయనమయ్యారు. భూకంపం వచ్చి నేలమట్టమైన శాన్‌ఫ్రాన్సిస్కోను పునర్ నిర్మించేందుకు భారీస్థాయిలో అప్పుడు చైనా నుంచి కార్మికులను తీసుకెళ్లారు. కార్మికులతో పాటే తానూ ఓడ ఎక్కారు పాండురంగ్.
అక్కడ హోటళ్లలో, ఆసుపత్రుల్లో చిన్నచిన్న పనులు చేస్తూ డబ్బులు కూడబెట్టుకొని కాలిఫోర్నియా యూనివర్సిటీలో వ్యవసాయశాస్త్ర విద్యార్థిగా చేరారు. 1910లో డాక్టరేట్ డిగ్రీ పూర్తయ్యింది. చదువుకుంటూనే... స్పెయిన్‌పై లాటిన్ అమెరికా దేశాల పోరాటం; మెక్సికో, ఐర్లాండ్‌ల్లో విప్లవపోరాటాల గురించి అధ్యయనం చేశారు. భవిష్యత్‌లో భారత్‌లో సాయుధ పోరాటానికి ఉపయోగ పడుతుందని... అమెరికాలోని ఓ మిలిటరీ అకాడమీలో శిక్షణకు చేరారు కూడా. పంజాబ్ నుంచి అమెరికా వలస వచ్చిన వారితో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌ను స్థాపించారు. తర్వాత స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ లాలా హర్‌దయాళ్‌తో కలసి గదర్ పార్టీ (తొలిపేరు పసిఫిక్ తీర హిందుస్థాన్ అసోసియేషన్)కి రూపకల్పన చేశారు. మెక్సికో విప్లవవాదుల సాయంతో విదేశాల్లోని చాలామంది భారతీయులకు సైనిక శిక్షణ ఇప్పించారు. కానీ... బ్రిటన్ గూఢచారులు చాలామంది గదర్ విప్లవవాదులను పసిగట్టి ప్రాణాలు తీశారు. తప్పించుకున్న పాండురంగ్ పారిస్‌కు, అక్కడి నుంచి జర్మనీకి వెళ్లారు. వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ తదితరులతో కలిసి బెర్లిన్ కమిటీని ఏర్పాటు చేశారు. రష్యా వెళ్లి వ్లాదిమిర్ లెనిన్‌ను కలిసి భారత్‌లో విప్లవపోరాటానికి మద్దతు కోరారు. ఇంతలో జర్మన్ కమిటీ ఆలోచనలను కూడా బ్రిటన్ గూఢచారులు దెబ్బతీశారు. అమెరికాలోనూ తనపై బ్రిటన్ నిఘా ఉందని తెలియటంతో పాండురంగ్ పాత విప్లవ మిత్రులున్న మెక్సికో చేరుకున్నారు.