తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi ka amrit mahotsav: ఎవరూ నమ్మని ఏఓ హ్యూమ్‌ - భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించిన ఏఓ హ్యూమ్​

Azadi Ka Amrit Mahotsav: పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు బ్రిటిష్‌ హయాంలో పనిచేసిన ఆంగ్లేయుల్లో కొంతమంది భారత అస్మదీయులూ ఉన్నారు. వారిలో మనం మరచిపోలేని పేరు అలెన్‌ ఓక్టావియన్‌ హ్యూమ్‌ (ఏఓ హ్యూమ్‌)! స్వాతంత్య్రోద్యమానికి పర్యాయపదమైన భారత జాతీయ కాంగ్రెస్‌ను భారతీయుల వెంటబడి మరీ స్థాపించిన సంస్కరణాభిలాషి మానవతావాది హ్యూమ్‌! ఆయన చొరవతో 1885లో సరిగ్గా నేటి రోజు డిసెంబరు 28న కాంగ్రెస్‌ మొగ్గతొడిగింది. బ్రిటిష్‌ విష కౌగిలి నుంచి బయటపడేందుకు మార్గం చూపించిన హ్యూమ్‌ చివరకు రెంటికీ చెడ్డ రేవడిలా అసంతృప్తితో భారత్‌ను వీడటం రాజకీయ వైచిత్రి!

ao hume
ఏఓ హ్యూమ్‌

By

Published : Dec 28, 2021, 8:02 AM IST

Azadi Ka Amrit Mahotsav: సిపాయిల తిరుగుబాటు అణచివేత తర్వాత ఈస్టిండియా పాలనను ముగించి నేరుగా భారత పగ్గాలు చేపట్టిన బ్రిటిష్‌ సర్కారు క్రమంగా తన పట్టు బిగించింది. ప్రజలు కూడా ఆంగ్లేయ పాలనకు అలవాటు పడసాగారు. బడుల్లో, చదువుల్లో, దుస్తుల్లో, బ్రిటిష్‌ అలవాట్లలోకి ఇమిడిపోసాగారు. క్రమంగా ఆంగ్లం చదువుకున్న మధ్యతరగతి పెరిగి... బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఉద్యోగాలను ఆశించటం ఆరంభమైంది. ఈ దశలోనే... హ్యూమ్‌ రంగ ప్రవేశం చేశారు.

1829లో స్కాట్లాండ్‌లో జన్మించిన హ్యూమ్‌.. వైద్యశాస్త్రం చదివి 1849లో బ్రిటిష్‌ సర్కారులో ఐసీఎస్‌ అధికారిగా భారత్‌లో అడుగుపెట్టారు. మొదట్నుంచీ భారతీయుల పట్ల సానుభూతితో వ్యవహరించారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో హ్యూమ్‌ అధికారిగా ఉన్న ఇటావా (ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్‌) ప్రాంతంలో పోరాటం ఉద్ధృతంగా ఉండేది. అయినా స్థానికులకు ఇబ్బంది కలుగకుండా పన్నులను రద్దు చేశారాయన. 'ఈ పేద ప్రజలను ఆ దేవుడే రక్షించాలి' అంటూ బాధపడ్డారు. తిరుగుబాటు సందర్భంగా బ్రిటిషర్ల అరాచకాలను చూసి కలత చెందిన ఆయన 1882లో రిటైర్‌ కాగానే భారతీయులకు, ఆంగ్లేయులకు మధ్య అంతరాన్ని పూడ్చటానికి నడుంబిగించారు. భారతీయుల పరిస్థితి మెరుగు పడాలంటే ఈ అంతరం తగ్గాలని హ్యూమ్‌ బలంగా నమ్మారు.
కోల్‌కతా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్లకు 1883లో ఆయనో లేఖ రాశారు. 'ప్రస్తుతం భారత్‌లో అత్యంత విద్యాధికులైన మీరు వ్యక్తిగత స్వార్థాలను పక్కనబెట్ మీకూ, మీ దేశానికి మరింత స్వేచ్ఛ లభించేలా, పాలనలో పారదర్శకత పెరిగేలా, ప్రభుత్వ నిర్ణయాల్లో మీ అభిప్రాయాలకు చోటు లభించేలా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైంది' అంటూ చైతన్యం నింపారు. అయితే అప్పటికే బెంగాల్‌, మద్రాసు, ముంబయిలాంటి ప్రాంతాల్లో కొన్ని సంఘాలు వెలిశాయి. బెంగాల్‌లో సురేంద్రనాథ్‌ బెనర్జీ, మద్రాసులో 'ది హిందూ' పత్రిక సారథ్యంలో భారతీయుల సమస్యల కోసం గళాలు వినిపించ సాగాయి. 1884లో మద్రాసులో జరిగిన దివ్యజ్ఞాన సమితి సమావేశంలో వీరందరినీ ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకున్నారు.

1885లో పుణెలో తొలి భేటీ అని అనుకున్నా అక్కడ కలరా మహమ్మారి కారణంగా వేదికను ముంబయికి మార్చారు. కాంగ్రెస్‌ ఏర్పాటుకు అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ డఫెరిన్‌ అనుమతి కూడా తీసుకున్నారు. ముంబయి గవర్నర్‌ రేను ఈ సమావేశానికి సారథ్యం వహించాల్సిందిగా ఆహ్వానించారు. కానీ రాలేదు. డిసెంబరు 28 నుంచి 31 దాకా ముంబయిలోని గోకుల్‌దాస్‌ తేజ్‌పాల్‌ సంస్కృత కళాశాలలో కాంగ్రెస్‌ ఆవిర్భావ సదస్సు సాగింది. 72 మంది ప్రతినిధులు హాజరైన దీనికి ఉమేశ్‌ చంద్ర బెనర్జీ తొలి అధ్యక్షుడిగా, హ్యూమ్‌ కార్యదర్శిగా వ్యవహరించారు. 'ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాలు ఉదయిస్తున్నాయి. కాస్త ఆలస్యమైనా మనం విజయం సాధిస్తాం' అంటూ హ్యూమ్‌ అందరిలో ఉత్తేజం నింపారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి సగటు భారతీయులకు మధ్య ఈ జాతీయ కాంగ్రెస్‌ వారధిగా వ్యవహరించాలని ఆయన ఆశించారు. కాంగ్రెస్‌కు, బ్రిటిష్‌ సర్కారుకు మధ్య సంబంధాన్ని ఆయన రోగి, డాక్టర్‌ల బంధంతో పోల్చారు. తనకున్న లక్షణాలేంటో, ఇబ్బందులేంటో డాక్టర్‌కు చెప్పాల్సిన బాధ్యత రోగిదే. అలాగే భారత ప్రజల సమస్యల గురించి సర్కారుకు జాతీయ కాంగ్రెస్‌ చెప్పాలని హ్యూమ్‌ భావించారు.

హజంగానే బ్రిటిష్‌ ప్రభుత్వం హ్యూమ్‌పై గుర్రుగా ఉండేది. ప్రజలకు, ప్రభుత్వానికి కాంగ్రెస్‌ వారధి అనే ఆయన మాటల్ని నమ్మేది కాదు. గమ్మత్తేమిటంటే కాంగ్రెస్‌లోని కొంతమంది నేతలు కూడా హ్యూమ్‌ను అనుమానాస్పదంగా చూడటం మొదలెట్టారు. 'ఆంగ్లేయుడి మార్గదర్శకంలో భారత జాతీయ కాంగ్రెస్‌ నడవటం అసహజం. దీంతో ఈ సంస్థకూ బ్రిటిష్‌ రాజకీయ లక్షణాలు అబ్బుతున్నాయి. చాలామంది చేరటానికి ముందుకు రావటం లేదు' అంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో ఆయన్ను క్రమంగా కాంగ్రెస్‌లో పక్కనబెట్టడం ఆరంభమైంది. అటు ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్‌ ఇద్దరూ నమ్మకపోవటంతో అసంతృప్తికి గురైన హ్యూమ్‌ 1892లో ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లారు. 1912లో కన్నుమూశారు. కేవలం రాజకీయాల గురించే కాకుండా భారత్‌లో పక్షులపైనా హ్యూమ్‌ అధ్యయనం చేశారు. వాటిపై అనేక పుస్తకాలు రాశారు.

ఇదీ చూడండి:

S 400 Missile System: గగనతల రక్షణలో కొత్త అధ్యాయం

ABOUT THE AUTHOR

...view details