Modi Comments On Congress : యూపీఏ ప్రభుత్వంలో దేశ బ్యాంకింగ్ రంగం భారీ విధ్యంసాన్ని చవిచూసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. తాము అధికారంలో వచ్చాకనే ఆ రంగం బలోపేతమైందని ఆయన అన్నారు. బ్యాంకింగ్ రంగం అత్యంత పటిష్ఠంగా ఉన్న దేశాల్లో ప్రస్తుతం భారత్ ఒకటని.. కానీ తొమ్మిదేళ్ల కింద పరిస్థితి ఇలా ఉండేది కాదని మోదీ తెలిపారు. కుంభకోణాల కారణంగా గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలను చవిచూశాయని పరోక్షంగా కాంగ్రెస్ పాలననుద్దేశించి ధ్వజమెత్తారు.
Rozgar Mela PM Modi 2023: దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో శనివారం జరిగిన రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లు భారత్‌కు ఎంతో కీలకమని చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఎంపికైన 70 వేలకు పైగా ఉద్యోగులకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్న వేళ.. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే అవకాశం రావడం గర్వకారణమని మోదీ అన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు దేశ ప్రజలు సంకల్పించారని ప్రధాని పేర్కొన్నారు.
"బ్యాంకింగ్ రంగం అత్యంత పటిష్ఠంగా ఉన్న దేశాల్లో నేడు భారత్ ఒకటి. 9 ఏళ్ల క్రితం పరిస్థితి ఇలా లేదు. గత ప్రభుత్వ హయాంలో మన బ్యాంకింగ్ రంగం భారీ విధ్వంసాన్ని చవిచూసింది. ఇప్పుడు బ్యాంకులు రికార్డు స్థాయి లాభాలు గడిస్తున్నాడి. ప్రస్తుతం మనం డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నాం. కానీ 9 ఏళ్ల క్రితం 140 కోట్ల మందికి ఫోన్ బ్యాంకింగ్ ఉండేది కాదు. ఒక నిర్దిష్ట కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు బ్యాంకులకు ఫోన్ చేసి వేల కోట్ల రుణాలు పొందారు. వాటిని తిరిగి బ్యాంకులకు చెల్లించలేదు. ఈ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్' గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిలో ఒకటి."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
Rozgar Mela 2023 July : రోజ్‌గార్ మేళాలో నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో చేరనున్నారు. రెవెన్యూ శాఖ, ఆర్థిక సేవల విభాగం, పోస్టల్, పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జలవనరుల శాఖ సహా వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల సమయంలో దేశంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. గత ఏడాది అక్టోబర్ 22న రోజ్‌గార్ మేళా మొదటి దశను ప్రారంభించారు.