Ram Rahim Singh Rakhis: కొన్ని సంవత్సరాలుగా రక్షాబంధన్ సమయంలో హరియాణాలోని రోహ్తక్ పోస్టాఫీసు ఉద్యోగులు విచిత్ర సమస్య ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్లుగా సునారియా జైలులో ఉన్న డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు వేలకొలది రాఖీలను వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పంపిస్తున్నారు. వాటిని వేరు చేసి, జైలుకు తరలించలేక తపాలా ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమిస్తున్నారు. గతేడాది సుమారు 40 వేల రాఖీలు వచ్చాయని.. ఈ సారి పూర్తిగా లెక్కింపు జరగలేదని పోస్టాఫీస్ ఉద్యోగులు చెబుతున్నారు.
గుర్మీత్ రామ్ రహీమ్‌కు వచ్చిన రాఖీ పోస్టులు "గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. రక్షాబంధన్‌కు ఐదు రోజుల ముందు నుంచే రాఖీలు, గ్రీటింగ్ కార్డులు వస్తున్నాయి. వాటిని ఓ లెవల్లో పెట్టడానికి రాత్రీపగలు పనిచేయాల్సి వస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రామ్ రహీమ్ పేరుతో పోస్టులు తెగ వస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే ఎనిమిది బస్తాల రాఖీలు వచ్చాయి. ఆటోలో తీసుకెళ్లి కొన్ని రాఖీల బస్తాలను జైలుకు తరలించాం. రక్షాబంధన్ అయ్యాక కూడా పదిహేను రోజుల వరకు వస్తూనే ఉంటాయి. గతేడాది 40,000 రాఖీలు వచ్చాయి. ఈ సారి మరిన్ని ఎక్కువగా వస్తాయని అంచనా వేస్తున్నాం.
-- అజ్మీర్ సింగ్, తపాలా శాఖ ఉద్యోగి
పోస్టులో వచ్చిన రాఖీలు, గ్రీటింగ్ కార్డులు 1,540 మంది అక్కాచెల్లెళ్లు ఉన్న సోదరుడు..
సాధారణంగా మనలో చాలామందికి ఒకరు లేదా ఇద్దరు.. మహా అయితే పది మంది వరకు అక్కాచెల్లెళ్లు ఉంటారు. రక్షా బంధన్ నాడు వారంతా వచ్చి రాఖీలు కట్టి తమ ప్రేమను చూపిస్తారు. కానీ సూరత్‌కు చెందిన చిరాగ్ దోషి అనే ఓ వ్యక్తికి మాత్రం 1,540 మంది సోదరీమణులు ఉన్నారు. వారందరూ ఏటా రక్షాబంధన్ రోజు చిరాగ్‌కు రాఖీలు కడతారు. అందుకు ఒక్క రోజు సమయం సరిపోదని.. అతడు ఏకంగా వారం రోజులపాటు రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటాడు.
అక్కాచెల్లెళ్లతో చిరాగ్ దోషి "నాకు దాదాపు 1540 మంది సోదరీమణులు ఉన్నారు. కేవలం గుజరాత్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నారు. వారందరూ నాకు కొత్త శక్తిని ఇస్తారు. దీంతో ప్రజలకు మరింతగా సేవ చేయాలనే ఉత్సాహం వస్తోంది. రాబోయే రోజుల్లో నా అక్కాచెల్లెళ్ల సంఖ్య 2100కు చేరబోతుంది. క్యాన్సర్, హెచ్ఐవీ బారిన పడిన వారు కూడా వచ్చి నాకు రాఖీలు కడతారు" అంటూ చిరాగ్ చెప్పుకొచ్చాడు. అయితే చిరాగ్ లాంటి సోదరుడు తమకు దొరకడం అదృష్టమని అంటున్నారు అతడి సోదరీమణులు. ఎలాంటి వారికైనా సహాయం చేయడంలో చిరాగ్ ముందుంటాడని చెబుతున్నారు.
ఇవీ చదవండి:స్వీపర్లు, ప్యూన్ల పిల్లలతో మోదీ రాఖీ వేడుకలు
ఈ రాఖీ గిఫ్ట్‌లతో అక్కాచెల్లెళ్లకు 'రక్ష'గా నిలుద్దాం!