Rohini court blast: దిల్లీలోని రోహిణీ కోర్టులో బాంబు దాడి చేసిన డీఆర్డీఓ శాస్త్రవేత్త భారత్ భూషణ్ కటారియా.. ఆత్మహత్యకు యత్నించారు. పోలీసు కస్టడీలో ఉన్న ఆయన.. విషాన్ని సేవించి చనిపోయేందుకు ప్రయత్నించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన్ను ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్‌కు తరలించినట్లు తెలుస్తోంది. శాస్త్రవేత్త ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
Rohini blast scientist suicide
"డీఆర్డీఓ శాస్త్రవేత్త ఏదో విష పదార్థాన్ని సేవించారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాం. కడుపులో నొప్పి ఉందని చెప్పారు. వాంతులు చేసుకున్నారు. దిల్లీ ఎయిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. నిందితుడి పరిస్థితి స్థిరంగానే ఉంది. నిజంగానే ఏదైనా తాగారా? లేదంటే తాగినట్లు నటించారా? అన్నది విచారణ జరిపి గుర్తిస్తాం."
-దిల్లీ పోలీసు వర్గాలు
కేసు దర్యాప్తులోనూ నిందితుడు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. 'సీసీటీవీ ఫుటేజీలో లాయర్ దుస్తుల్లో కనిపిస్తోంది మీరేనా? అని అడిగితే.. అక్కడికి వెళ్లే ఉంటానని కటారియా బదులిచ్చారు. పేలుడు తర్వాత ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నిస్తే.. తనకేం గుర్తు లేదని చెప్పారు'
Rohini court DRDO
డిసెంబర్ 9న రోహిణీ కోర్టు కాంప్లెక్స్‌లో స్వల్ప తీవ్రతతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కోర్టు నయీబ్ గాయపడ్డారు. ల్యాప్‌టాప్ బ్యాటరీ పేలి ఉంటుందని ప్రాథమికంగా భావించారు పోలీసులు. అయితే, కోర్టులో ఉద్దేశపూర్వకంగానే టిఫిన్ బాక్స్ బాంబును పెట్టినట్లు తేల్చారు. దానిని రిమోట్ కంట్రోలర్ ద్వారా ఆపరేట్ చేసినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ప్రత్యేక విభాగానికి అప్పగించారు. 100కుపైగా సీసీటీవీలను పరిశీలించిన అనంతరం నిందితుడిని పట్టుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆ రోజు కోర్టు ఆవరణలోని అనుమానిత ప్రాంతాల్లో నిందితుడి చిత్రాలు కనిపించినట్లు చెప్పారు. అతని సమీపంలో ఉన్నవారిలో ఒకరిని పొరుగింటి వ్యక్తిగా గుర్తించారు.
ఇదీ చదవండి:'రోహిణి కోర్టు పేలుడు'లో సైంటిస్ట్ అరెస్ట్.. సొంతంగా బాంబు తయారు చేసి..