రాజస్థాన్ జైపుర్‌కు చెందిన గుల్మోహర్ గార్డెన్ సొసైటీ వాసులు దీపావళిని వినూత్నంగా జరుపుకొన్నారు. రోబోలతో కలిసి టపాసులను కాలుస్తూ, దీపాలను వెలిగిస్తూ జరుపుకొన్నారు. రోబోలు.. సొసైటీ వాసులతో కరచాలనం చేస్తూ, అతిథులను ఆప్యాయంగా పలకరిస్తూ వేడుకలను మరింత ఆహ్లాదకరంగా చేశాయి. ఈ రోబోలు అత్యవసర పరిస్థితుల్లో మంటలను ఆర్పడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం వంటి పనులను ఇవి సమర్థంగా చేయగలవని రోబోటిక్ నిపుణులు భువనేశ్ మిశ్రా చెప్పారు. సొసైటీలోని ఈ నాలుగు రోబోలు కెఫటేరియాలో ఆహారం అందించే పనులతో పాటు ఇతర అనేక పనులను చేయడంలో సహాయపడుతాయన్నారు. దీపావళి వేడుకల్లో పాల్గొన్న రోబోలలో షేనా 5.0 ఆల్ టెరైన్ రోబో, షేనా 6.0 సోలార్ మ్యాన్‌హోల్ క్లీనింగ్ రోబో, సోనా 3.5 ఏఐ హ్యూమనాయిడ్ రోబో, సోనా 2.5 సర్వీస్ మెన్ రోబోలు ఉన్నాయి. జైపుర్‌కు చెందిన క్లబ్ ఫస్ట్ రోబోటిక్ సంస్థ ఈ రోబోలను తయారు చేసింది.
"మనమందరం దీపావళిని కుటుంబాలతో ఆనందంగా జరుపుకుంటాం, అదే ఎల్లప్పుడు మన క్షేమం కోసం పనిచేసే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు మాత్రం వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రోబోలు వారికి బాసటగా నిలుస్తాయి."
భువనేశ్ మిశ్రా, రోబోటిక్ నిపుణులు