Robot Waiter in Restaurant: మనం ఎక్కడైనా హోటల్‌కు వళ్తే.. వెయిటర్ మన దగ్గరికి వస్తాడు. ఏం కావాలో చెబితే అతడు తెచ్చి ఇస్తాడు. కానీ కర్ణాటక మైసూర్‌లోని సిద్ధార్థ హోటల్‌కు వెళ్తే.. మీరు ముందు 'రోబో సుందరి'ని కలవాలి. మీకు ఏం కావాలో దానికి చెబితే క్షణాల్లో తెచ్చేస్తుంది. సర్వర్‌గా సేవలు చేస్తున్న ఈ రోబో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా పేరుగాంచింది.
మైసూర్లో పేరుపొందిన హోటల్ సిద్ధార్థ. నిత్యం వెయిటర్ల కొరత యాజమాన్యాన్ని వేధిస్తోంది. దీంతో ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వెయిటర్ల స్థానంలో ఓ హ్యూమనాయిడ్ రోబోను నియమించారు. రూ.2.5 లక్షలు ఖర్చు చేసి దిల్లీలోని ఓ సంస్థ నుంచి కొనుగోలు చేశారు. కస్టమర్లు హోటల్‌కు రాగానే ఆహారపదార్థాల మెనూను చూపిస్తుంది ఈ రోబో. వాయిస్ కమాండ్లను ఆనుసరించే విధంగా ఇందులో ప్రీ- ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా పనిచేసే విధంగా బ్యాటరీ ఉంటుంది. ఒకేసారి పది కేజీల వరకు బరువును అలవోకగా మోయగలదు. హోటల్లో టేబుల్స్ మధ్య సౌకర్యవంతంగా కదలడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను చేశారు. సంప్రదాయ చీరకట్టు, ఒంటినిండా నగలతో ఈ రోబో సేవలు అందిస్తుంటే కస్టమర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.