2014 హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ.. అప్పటి ముఖ్యమంత్రితో కలిసి రాబర్ట్ వాద్రా అక్రమ భూలావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీజేపీ మాటమార్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలకు.. అధికారంలోకి వచ్చాక క్లీన్చిట్ ఇచ్చింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త.. రాబర్ట్ వాద్రా ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపింది. పంజాబ్ హరియాణా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. రాబక్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ల్యాండ్‌ను, డీఎల్ఎఫ్కు బదిలీ చేయడంలో ఎటువంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని హరియాణా ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ జరిగింది..
2007లో రాబర్ట్ వాద్రా.. స్కైలైట్ హాస్పిటాలిటీ అనే సంస్థను లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించారు. ఆ తరువాత 2008లో గుర్గావ్‌లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు సుమారు 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మరుసటి రోజే ఆ భూమి స్కైలైట్ హాస్పిటాలిటీకి ముటేషన్ అయింది. కేవలం 24 గంటల్లోనే రాబర్ట్ వాద్రాకు భూమి బదలాయింపు పక్రియ జరిగింది. ఈ ప్రకియ మొత్తం పూర్తి కావడానికి సాధారణంగా అయితే మూడు నెలల సమయం పడుతుంది.
అనంతరం నెల తరువాత అక్కడ భవనం నిర్మాణం చేసేందుకు.. అప్పటి భూపీందర్ సింగ్ హుడా నేతృత్వంలోని హరియాణా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. దీంతో ఆ భూమి విలువ అమాంతంగా పెరిగిపోయింది. డీఎల్‌ఫ్ సంస్థ 2002 జూన్‌లో ఈ ప్లాట్‌ను రూ.58 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కదుర్చుకుంది. అంటే కేవలం కొన్ని నెలల్లోనే వాద్రా ఆస్తి విలువ దాదాపు 700% పెరిగింది. 2012 అక్టోబర్‌లో అప్పటి డైరెక్టర్ జనరల్, కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్-కమ్-ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌గా ఉన్న అశోక్ ఖేమ్కా.. ఈ మ్యుటేషన్‌ను రద్దు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి హుడా ఆదేశాల మేరకు 2012 అక్టోబరు 11న ఖేమ్కా బదిలీ అయ్యారు.