ఉత్తర్ప్రదేశ్ బులంద్షెహర్లో ముంబయికి చెందిన ఓ వ్యాపారి దోపిడీకి గురయ్యాడు. ఆదాయపు పన్నుశాఖ అధికారిగా వచ్చిన దుండగులు.. వ్యాపారి నుంచి సుమారు రూ.72 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటన ఖుర్జా నగర్ ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది..
కస్గంజ్ నగల వ్యాపారి నవనాథ్ దగ్గర పనిచేస్తున్న ఓంకార్, శివాజీలు.. దిల్లీలోని ఓ వ్యాపారికి రూ. 72 లక్షలు ఇచ్చేందుకు కారులో బయలుదేరారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఆ వాహనాన్ని మరో కారు ఓవర్టేక్ చేసింది. అందులోంచి వచ్చిన ఇద్దరు దుండగులు.. ఐటీ అధికారుల పేరుతో కారులోని వారిని విచారించడం ప్రారంభించారు. ఉద్యోగుల నుంచి డబ్బు తీసుకున్న దుండగులు.. వారిని ముందు వెళ్లమని, ఆ తర్వాత వెనక తాము వస్తామని అన్నారు.