రాజస్థాన్ జైపుర్‌లో దారుణం జరిగింది. 108 ఏళ్ల వృద్ధురాలి కాళ్లను నరికి వెండి కడియాలను ఎత్తుకెళ్లిపోయారు దుండగులు . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 5.30 నిమిషాలకు జైపుర్‌లోని బస్ బదన్పురామీనా కాలనీలో ఈ ఘటన జరిగింది. వృద్ధురాలు జమునా దేవి.. తన ఇంటి వరండాలో ఉన్న సమయంలో దుండగులు ఆమెను బాత్రూమ్లోకి లాక్కెళ్లారు. అనంతరం బాధితురాలి కాళ్లను నరికేసి వెండి కడియాలను ఎత్తుకెళ్లిపోయారు. గుడికి వెళ్లిన బాధితురాలి కుమార్తె ఇంటికి వచ్చింది. హుటాహుటిన తల్లిని ఎస్ఎమ్ఎస్ ఆస్పత్రికి తరలించింది. వృద్ధురాలిపై దాడికి నిందితులు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
పదునైన ఆయుధంతో..
బంగాల్లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో దారుణం జరిగింది. మాజీ భర్త.. ఓ మహిళ ప్రస్తుత భర్తపై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితుడు బిశ్వజిత్ బిస్వాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితుడు సుకాంత భద్రను పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే..
రింకూ, సుకాంత భార్యాభర్తలు. వీరిద్దరూ ఎనిమిదేళ్ల నుంచి విడిగా ఉంటున్నారు. ఈ ఏడాది మే 25న బిశ్వజిత్ అనే వ్యక్తిని రింకూ వివాహమాడింది. ఇది నచ్చని సుకాంత పదునైన ఆయుధంతో.. బిశ్వజిత్ తల, మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితుడు బిశ్వజిత్ అరుపులు విన్న స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.