మధ్యప్రదేశ్లోని సీదీ జిల్లాలో నమోదైన ఓ పోలీసు కేసు చర్చనీయాంశంగా మారింది. తమ గ్రామంలో కిలోమీటర్ మేర నిర్మించిన రహదారి దొంగతనానికి గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్థులు.
ఏం జరిగిందంటే..?
సీదీ జిల్లా కేంద్రానికి 55కి.మీ. దూరంలో ఉన్న మేద్రాలో నిర్మించిన రహదారి రాత్రయ్యేసరికి దొంగతనానికి గురైందని గ్రామస్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. కేవలం కాగితాలకే పరిమితమైన రహదారి నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నిరసనగా గ్రామస్థులు ఈ చర్య చేపట్టారు. తమ గ్రామంలో మొదట రూ.10 లక్షల వ్యయంతో మట్టి రోడ్డును నిర్మించినట్లు తెలిసి ఆశ్చర్యపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆ తరువాత మరో రూ.10 లక్షల రూపాయలు అదనంగా వెచ్చించి.. దాన్ని సీసీ రోడ్డుగా మార్చారని.. ఇప్పుడు ఆ రహదారి కూడా అక్కడ లేదని.. కచ్చితంగా అది దొంగతనానికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు మార్గం లేని ఈ గ్రామ ప్రజలు.. ప్రమాదక రీతిలో నాటు పడవల ద్వారా నర్మదా నదిని దాటుతూ.. ప్రయాణాలు సాగిస్తుంటారు.
"మా గ్రామంలో రహదారిని ఎవరో దొంగిలించారు. ఉదయం ఎక్కడైతే నిర్మించారో అదిప్పుడు లేదు. 2017లో మట్టితో నిర్మించిన ఈ రహదారిని.. సీసీ రోడ్డుగా మార్చినట్లు కాగితాల్లో ఉంది. అయితే ఇప్పుడు అది కనిపించట్లేదు. దాని జాడ కూడా లేదు."