కర్ణాటకలో అధికారులు తలపెట్టిన మౌలిక వసతుల కల్పన కార్యక్రమం నవ్వులపాలైంది. కొప్పల జిల్లాలో చెట్ల చుట్టూ సీసీ రోడ్లు నిర్మించిన మున్సిపల్ అధికారుల నిర్వాకం విమర్శలకు దారి తీసింది. ప్రణాళికలో లేని ప్రాంతాల్లో రోడ్లు వేసి.. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదురవుతున్నాయి.
రోడ్ల నిర్మాణానికి ముందు ఇక్కడి ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటారు అటవీ అధికారులు. అయితే వాటి చుట్టే సీసీ రోడ్లు నిర్మించారు మున్సిపల్ అధికారులు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అటవీ అధికారులకు.. విచిత్ర సమాధానం చెప్పారు. తాము చెట్లను నరికివేయబోమని చెప్పుకొచ్చారు.
అయితే, రోడ్డు నిర్మాణం పూర్తైనందున.. చెట్లను తొలగించేందుకు అనుమతించాలని జోనల్ కన్సర్వేషన్ అధికారిని మున్సిపల్ అధికారులు కోరినట్లు తెలుస్తోంది. కానీ, రోడ్డు లేఅవుట్ను సమర్పించాలని, అప్పుడే దానికి అనుమతిస్తామని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.