Road Accident in Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ బాందా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు సహా ఏడుగురు మృతి చెందారు. వేగంగా వచ్చిన ఓ బొలేరో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మందిలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరెంట్ షాక్కు గురైన బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ జరిగింది
తిలౌసా గ్రామానికి చెందిన 15 ఏళ్ల కల్లు కరెంట్ షాక్కు గురయ్యాడు. దీంతో చికిత్స కోసం అతడిని బబేరూలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తున్నారు. బాలుడి తల్లి సహా గ్రామానికి చెందిన మరో ఏడుగురు ఓ బొలేరో కారులో ప్రయాణిస్తున్నారు. ఆస్పత్రికి తొందరగా వెళ్లాలనే ఉద్దేశంతో వేగంగా కారును నడిపాడు డ్రైవర్. ఈక్రమంలోనే పరాయియాదయీ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆపిన ఓ ట్రక్కును ఢీ కొట్టారు.