Road accident in Srikalahasti: దైవదర్శనానికి బయల్దేరిన రెండు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాళహస్తి సమీపంలోని మిట్టకండ్రిగ వద్ద అతివేగంతో కారు లారీని ఎదురుగా ఢీకొట్టడంతో కారులోని.. నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి - శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం
14:12 July 09
మృతులంతా విజయవాడకు చెందినవారుగా గుర్తింపు
విజయవాడ కృష్ణలంకలోని బాలాజీనగర్‌కు చెందిన రమేశ్ చిట్టీల వ్యాపారం, ఆయన భార్య రాజ్యలక్ష్మి మగ్గం వర్క్ చేస్తుంటారు. వీరు తమ కుమారుడు భరత్, రాజ్యలక్ష్మి సోదరి శ్రీలత.. పోలీస్ కాలనీలో నివసించే కానిస్టేబుల్ నర్సింహామూర్తి కుటుంబంతో కలిసి.. శుక్రవారం రాత్రి కారులో విజయవాడ నుంచి తిరుమల వెళ్లారు. శనివారం తిరుమలలో స్వామి దర్శనం చేసుకున్నారు.
ఆదివారం ఉదయం విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో శ్రీకాళహస్తిలో శివుని దర్శనం చేసుకుని వస్తామని స్థానికులకు తెలిపారు. శ్రీకాళహస్తికి కొద్దిదూరంలో ఉండగా వీరు ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేశ్ కుటుంబంలో ముగ్గురు, నరసింహమూర్తి, ఆయన భార్య వెంకటరమణమ్మ, వారి కుమార్తె అక్షయ మృతిచెందారు.
రమేశ్ కుమారుడు భరత్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. క్షతగాత్రుడిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన రమేశ్, ఆయన భార్య రాజ్యలక్ష్మి స్వస్థలం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం అరజావారిపాలెం. వీరి కుమారుడు భరత్ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రమేశ్ దంపతుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.