Road accident in Rangareddy District Today : బక్రీద్ పండుగకు గొర్రెలు తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రవి, వనపర్తి జిల్లాకు చెందిన శంకర్, అశోక్.. ముగ్గురు కలిసి బక్రీద్ పండుగ కోసం బొలెరో వాహనంలో గొర్రెలు తీసుకుని నిన్న హైదరాబాద్‌కు వెళ్లారు. ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారిపై తిరిగి వస్తున్నారు.
Road accident in Shadnagar Today : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
10:53 June 24
అదుపుతప్పి లారీని ఢీకొన్న బొలెరో వాహనం
ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివారులోని సోలీపూర్ సమీపంలో గల వై-జంక్షన్ వద్దకు రాగానే.. వేగంగా వెళ్తున్న వీరి వాహనం అదుపుతప్పింది. ఈ క్రమంలో డివైడర్‌పైకి ఎక్కిన బొలెరో రోడ్డుకు మరోవైపు దూసుకెళ్లింది. ఇదే సమయంలో జడ్చర్ల వైపు నుంచి హైదరాబాద్‌కు వడ్ల లోడ్‌తో వెలుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో పక్కకు ఎగిరిపడింది. దీంతో బొలెరో డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని.. తీవ్రంగా గాయపడిన శంకర్, రవిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో శంకర్ చనిపోగా.. ఉస్మానియాకు తరలిస్తుండగా రవి ప్రాణాలు విడిచాడు. మృతుల్ని నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నార్యానాయక్‌తండాకు చెందిన రవి, వనపర్తి జిల్లా పానగల్ మండలం తెల్లరాళ్లపల్లికి చెందిన శంకర్.. ఇదే మండలం మాందాపూర్‌కు చెందిన అశోక్‌గా పోలీసులు నిర్ధారించారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన యువకులను ఆస్పత్రికి తరలించే క్రమంలో అక్కడ పడిపోయిన నగదును అంబులెన్స్ సిబ్బంది గుర్తించారు.
ముగ్గురూ చనిపోవటంతో.. వారికి సంబంధించిన లక్షా 92వేల రూపాయలను అంబులెన్స్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఆపద సమయంలో ప్రాణాలు నిలిపేందుకు వారు చేసిన ప్రయత్నానికి తోడు.. దొరికిన డబ్బును బాధిత కుటుంబాలకు చేర్చాల్సిందిగా పోలీసులకు అప్పజెప్పటం పట్ల స్థానికులు అంబులెన్స్ సిబ్బందిని అభినందించారు. ముగ్గురు యువకుల మృతితో వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి :