Road Accident in Shamirpet :నిత్య జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ ఊహించలేరని పెద్దలు ఎప్పుడూ అంటుంటారు. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మనం బాగానే వాహనం నడుపుతున్నా.. ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం. ఎంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా.. కొన్నిసార్లు ఇతరులు చేసినా తప్పులకూ ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటిపై అధికారులు, పోలీసులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా వారు ప్రమాదాల బారిన పడటంతో పాటు వేరే కుటుంబాలనూ అంధకారంలోకి నెట్టివేస్తున్నారు.
Road Accident in Outer Ring Road : తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై.. ఘట్‌కేసర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న లారీ.. ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ క్రమంలోనే డివైడర్ పై నుంచి ఎగిరి అటుగా వస్తున్న బొలెరో, కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరిని ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన నర్సింహగా పోలీసులు గుర్తించారు. మిగతా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.