Road Accident In Madhya Pradesh : పెళ్లికి వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవశాత్తు నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో బుధవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. దుర్సాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వెళ్తున్న మినీ ట్రక్కు బుహరా నదిలో బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రదీప్ శర్మ సహా ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. వీరంతా ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఇదీ జరిగింది
గ్వాలియర్‌కు బిల్హెటి గ్రామానికి చెందిన ప్రజలు.. టికంగఢ్లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఓ మినీ ట్రక్కులో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బుహరా గ్రామంలోని వంతెన వద్దకు రాగానే అదుపుతప్పి నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 30 మంది వరకు గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో ట్రక్కులో 50 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు అధికారులు. వీరిలో ముగ్గురు చిన్నారులు కాగా.. ఓ యువకుడు, వృద్ధురాలు ఉన్నారు. వీరంతా వధువును తీసుకుని పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. దీంతో పెళ్లి జరగాల్సిన వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.