Road Accident in Jammu Today : బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోతు లోయలో పడిపోవడం వల్ల 38 మంది చనిపోయారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జమ్ముకశ్మీర్‌లోని డోడా జిల్లాలోని బాటోటె-కిష్ట్వార్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు.
అధికారుల సమాచారం ప్రకారం.. JK02CN-6555 రిజిస్ట్రేషన్ నంబర్ గల బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారంతా క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటామనుకున్నారు. అంతలోనే విధి వారి జీవితాలను చిధిమేసింది. బాటోటె-కిష్ట్వార్ జాతీయ రహదారిపై బస్సు రాగానే.. అదుపుతప్పి 300 అడుగులు ఉన్న లోయలో పడింది. ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థంకాలేదు. భయంతో కేకలు వేశారు. అంతలోనే బస్సులో ఉన్న అనేక మంది ప్రాణాలు అనంత లోకాల్లో కలిసిపోయాయి. మరికొందరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఎవరైనా వచ్చి తమను కాపాడితే బాగుండని అనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది.. స్థానికులతో కలిసి సహాయక చర్యల్లో చేపట్టారు. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. చాలా ఎత్తు నుంచి లోయలో పడిపోవడం వల్ల బస్సు పూర్తిగా దెబ్బతింది.
మరోవైపు.. జమ్ముకశ్మీర్ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రులు అమిత్ షా, జితేంద్ర సింగ్, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందించనున్నట్లు తెలిపారు.