జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్వామా జిల్లాలో బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గాయపడ్డారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై శనివారం జరిగిందీ ప్రమాదం. మృతులంతా బిహార్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. క్షతగాత్రులందరిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు.
కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మరో 28 మంది.. - 17 people washed away in Chambal river
10:21 March 18
కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మరో 28 మంది..
ప్రమాద ఘటనపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని అధికారులకు సూచించారు. "ఈ రోజు పుల్వామా జరిగిన బస్సు ప్రమాదం వల్ల నేను చాలా బాధపడ్డాను. ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరి కొంత మంది గాయపడ్డారు. బాధిత వ్యక్తులకు అవసరమైన సహాయాన్ని అందించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసాను." అని ట్విట్టర్ ద్వారా మనోజ్ సిన్హా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు వీలైనంత సహాయం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.
భద్రతా బలగాలు, తీవ్రవాదుల మధ్య కాల్పులు..
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా మిత్రిగామ్ ప్రాంతంలో తీవ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ముష్కరులు ఉన్నారనే సమాచారంతో మిత్రిగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా తీవ్రవాదులు, సైన్యంపై కాల్పులకు దిగడం వల్ల బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. తీవ్రవాదులను ఏరివేసే పనిలో సాయుధ బలగాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మిత్రిగామ్ సహా జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
చంబల్ నదిలో కొట్టుకుపోయిన 17 మంది..
రాజస్థాన్, మధ్యప్రదేశ్ సరిహద్దులో తీవ్ర విషాదం నెలకొంది. చంబల్ నది దాటుతుండగా 17 మంది కొట్టుకుపోయారు. అందులో నలుగురు మృతి చెందారు. మరో పది మందిని స్థానికులు, అధికారులు కలిసి కాపాడారు. ముగ్గురి ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో శనివారం జరిగిందీ దుర్ఘటన. కైలా దేవి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితులు మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలోని సిలైచౌన్ గ్రామస్థులని అధికారులు తెలిపారు. వారు చంబల్ నదిని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.