ఝార్ఖండ్ గుమ్లా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం చైన్‌పుర్ సబ్ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మరొక ఆస్పత్రికి మార్చారు.
9 నెలల చిన్నారికి సైతం..
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో సుమారు 45 నుంచి 55 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులు సుందర్ గయార్(50), లుందారి దేబి(45), సబితా దేబి, పులికర్ కిండో(50), అల్సు నగేసియాగా గుర్తించారు పోలీసులు. కాగా, సుందర్ గయార్, లుందారి దేబి భార్యాభర్తలు. గాయపడిన వారిలో 15 ఏళ్లలోపు చిన్నారులు సహా 9 నెలల నవజాత శిశువు కూడా ఉన్నట్లు సమాచారం.
డివైడర్‌ను ఢీకొన్న ఆటోలో మంటలు.. ప్యాసింజర్ మృతి!
మహారాష్ట్రలోని ఠాణె నగరంలో ఘోడ్‌బందర్ రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటో డివైడర్‌ను ఢీకొంది. దీంతో ఆటోలో మంటలు చెలరేగి అందులో ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలు సజీవదహనమైంది. ఆటో డ్రైవర్ రాజేశ్ కుమార్(45) తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు. ఈ అగ్ని ప్రమాదంలో ఆటో పూర్తిగా దగ్ధమయింది.
మట్టి ఇల్లు కూలి.. 24 రోజుల శిశువు!
కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలోని కనకగిరి తాలూకాలోని జిరాల గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టి ఇళ్లు కూలి 24 రోజుల నవజాత శిశువు సహా ఫకీరమ్మ తిమ్మన్న భోవి(60) అనే వృద్ధురాలు మృతిచెందారు. అదృష్టవశాత్తు చనిపోయిన చిన్నారి తండ్రి కనకప్ప తలావార్ ఇంటి బయట నిద్రిస్తుండడం వల్ల ఆయన ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటనలో శిశువు తల్లి కనకమ్మ కాలు కూడా విరగింది. దీంతో ఆమెను కనకగిరిలోని కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కనకగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వర్షం కారణంగా కూలిన మట్టి ఇల్లు ఇదే. బైక్-క్రేన్ ఢీ.. నలుగురు మృతి!
మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో మంగళవారం రహదారిపై బైక్-క్రేన్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.