Road Accident in Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి 60 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు, వారి మేనల్లుడు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలతో బయటపడ్డాడు.
ఈ సంఘటన మసోబా వాడి ఫటా గ్రామానికి సమీపంలో బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు సతీశ్ పంజుమల్ టెక్వానీ(58) ఆయన ఇద్దరు సోదరులు శంకర్(46), సునీల్(48), మేనల్లుడు లఖన్ మహేశ్ టెక్వానీగా (20) గుర్తించారు. వారంతా బీడ్ నగరం నుంచి అహ్మద్‌నగర్ జిల్లా కేంద్రానికి వెళ్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు.
వివాహానికి హాజరై వస్తుండగా:ఝార్ఖండ్ సరాయ్‌కేలా ఖర్సావాన్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాండిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్గు పూలియా ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జంషెడ్‌పుర్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఉర్మాల్ గ్రామానికి చెందిన వారు వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.