Road accident at Katakshpur Athmakuru road : దైవదర్శనానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుల్లా క్రాస్ సమీపంలో ములుగు జాతీయ రహదారిపై జరిగింది. వరంగల్ కాశిబుగ్గకు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు మేడారం దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నక్రమంలో నీరుకుల్లా క్రాస్ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్.. కారును బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అనుముల నరసింహస్వామి(50), వెల్దండి సాంబరాజు(42), వెల్దండి ఆకాంక్ష (26), వెల్దండి లక్ష్మీప్రసన్న(6) నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం సమయంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. తీవ్ర గాయాల పాలైన అనుముల రాజ శ్రీ, అనుముల హర్షిత, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందిస్తున్నారు. కారు నడుపుతున్న డ్రైవర్ ఆకర్ష్‌తో పాటు ఆరు సంవత్సరాల బాలుడు అక్షయ రాజు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
Road accident on Katakshpur Athmakuru road : ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్ ప్రాణాల నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కాశిబుగ్గలో విషాదఛాయలు అలుముకున్నాయి. లారీ బలంగా ఢీకొట్టడంతో నుజ్జునుజైన కారులో మృతదేహాలు చిక్కుకున్నాయి. కొన్ని గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది. మృతి చెందిన నలుగురిని శవ పరీక్ష నిమిత్తం వరంగల్ మార్చురీకి తరలించారు.
తీవ్ర గాయాలపాలైన ఇద్దరు మహిళలు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడం పలువురిని కలిచివేసింది. ఈ ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వరంగల్ సీపీతో ఫోన్లో మాట్లాడారు. వరంగల్ ఎంజీఎం సూపర్ండెంట్తో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు.
Road accident at Karimnagar : మరోవైపు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రెడ్డి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను జీపు బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 15మంది వరకు గాయపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. స్థానికుల కథనం ప్రకారం.. క్షతగాత్రులందరూ హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. వీరందరూ కాళేశ్వరం నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
ఇవీ చదవండి: