దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన కరెన్సీ నోట్ల విషయం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఆర్జేడీ మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. దేవతల చిత్రాలకు బదులుగా ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్, కర్పూరి ఠాకూర్ చిత్రాలను ఉంచాలని కోరారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్. ఇలా చేస్తే భారతీయ కరెన్సీ విలువ తగ్గదని చెప్పారు.
మరోవైపు బిహార్ భాజపా అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్.. ఆర్జేడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 'భారతీయ కరెన్సీ అనేది ఆర్జేడీ ఎన్నికల మేనిఫెస్టో కాదు. ఎవరో దేవతల ఫొటోలను పెట్టాలని కోరారు.. ఇప్పుడు మీరు లాలూ, కర్పూరి చిత్రాలను ఉంచాలని కోరుతున్నారు. మీరందరూ మీకు నచ్చిన విధంగా వ్యవహరిస్తే.. నోట్లపై తేజశ్వీ యాదవ్ చిత్రాలను కూడా ఉంచాలని డిమాండ్ చేస్తారు' అని ఆయన అన్నారు.
"ఈ దేశ ప్రజలు మూర్ఖులు కాదు, మనం లౌకిక రాజ్యంలో బతుకుతున్నాము. మన దేశంలో దేవతలకు, దేవుళ్లకు దేవాలయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. గాంధీ గారి చిత్రాలు ఇప్పటికే ఉన్నాయి. ఇలాంటి విషయాలపై భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. జాతీయవాదంతో రాజకీయాలు ఆడటం మానుకోండి. ఇవి కుటుంబ రాజకీయాలు కాదు.. ఇలాంటి డిమాండ్లు చేయడం మానుకోండి"