రైల్వే ఉద్యోగాల భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు సహా మరికొంత మందికి దిల్లీ న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసింది. వీరిలో లాలూ భార్య బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీ, కుమార్తె మీసా భారతి ఉన్నారు.
2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ఉద్యోగాలకు భూములు తీసుకున్నారని సీబీఐ లాలూ కుటుంబంపై అభియోగాలు మోపింది. ఉద్యోగాలు పొందిన వారు లాలూ కుటుంబసభ్యులకు భూములు కానుకగా, అలాగే అతి తక్కువ ధరకు విక్రయించారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు లాలూ, రబ్రీదేవి, మిసా భారతి బుధవారం హాజరయ్యారు. ఇటీవలే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న లాలూ ప్రసాద్(74) ఉదయం 10 గంటలకు వీల్‌ఛైర్‌లో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ముందు హాజరయ్యారు. ఒక్కొక్కరికీ రూ.50,000 చొప్పున వ్యక్తిగత పూచీకత్తుపై వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదంతా రాజకీయ ప్రేరేపితమైన కేసని ఆర్జేడీ ఆరోపిస్తోంది. బీజేపీ చెప్పినట్లే సీబీఐ ఆడుతోందని విమర్శించింది.
ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యులకు బెయిల్ రావడంపై ఆర్జేడీ ఎమ్మెల్యేల సంబరాలు ఘర్షణకు దారితీశాయి. తమ అధినేతకు బెయిల్ మంజూరు కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ పట్నాలోని శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రీయ జనతా దళ్ సభ్యులు లడ్డూలు పంచిపెట్టారు. అయితే ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలతో వారికి గొడవ జరిగింది. ఇరు వర్గాలు తోపులాటకు దిగాయి. ఆర్జేడీ ఎమ్మెల్యేలు బలవంతంగా తమకు లడ్డూలు తినిపించి, ఇబ్బంది పెట్టారని బీజేపీ శాసనసభ్యులు ఆరోపించారు.