Rishi Sunak Visits Akshardham Temple Delhi : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. దిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. భారత మూలాలున్న ఆయన.. ఆదివారం తన భార్య అక్షత మూర్తితో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సునాక్ రాక సందర్భంగా అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. దాంతోపాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు, తన భార్య అయిన అక్షత మూర్తితో కలిసి.. రెండు రోజుల జీ20 సదస్సు కోసం భారత్ వచ్చారు రిషి సునాక్.
Modi Sunak Bilateral Talks :రిషి సునాక్.. ప్రధాని నరేంద్ర మోదీ మధ్య శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంతో పాటు వాణిజ్య సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు. "జీ20 సదస్సు సందర్భంగా దిల్లీకి వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలవడం చాలా గొప్ప విషయం. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంచేందుకు మేం చర్చించాం. సంపన్నమైన ప్రపంచం కోసం భారత్, బ్రిటన్ నిరంతరం కృషి చేస్తాయి" అని చర్చలు అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Rishi Sunak G20 India Visit : రిషి సునాక్, తన భార్య అక్షతా మూర్తితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం భారత్‌కు వచ్చారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన నృత్యాలను రిషి సునాక్ దంపతులు ఆసక్తిగా తిలకించారు.