Rishi Sunak G20 India Visit :సెప్టెంబర్ 9,10 తేదీల్లో భారత్ వేదికగా జరగబోయే జీ-20 సమావేశాలకు హాజరయ్యేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా భార్య అక్షతా మూర్తితో వచ్చిన ఆయనకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన నృత్యాలను రిషి సునాక్-అక్షతా మూర్తి దంపతులు ఆసక్తిగా తిలకించారు.
అంతకుముందు.. మీడియాతో సరదాగా మట్లాడిన 43 ఏళ్ల సునాక్ ఈ పర్యటన( Uk Prime Minister India Visit ) తనకెంతో ప్రత్యేకం అని పేర్కొన్నారు. 'భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాన మంత్రి హోదాలో.. అది కూడా ఇక్కడి అమ్మాయిని వివాహం చేసుకొని భారత దేశపు అల్లుడిగా ఇక్కడకు రావడం నాకెంతో ఆనందంగా ఉంది' అంటూ రిషి సునాక్ చమత్కరించారు. కాగా, జీ-20 సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి బ్రిటన్ ప్రధాని ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.
"నేను ఓ స్పష్టమైన అజెండాతో ఈ జీ20 సమావేశాలకు హాజరవుతున్నాను. ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం, అంతర్జాతీయ సంబంధాలను మరింత బలోపేతం చేయడం సహా రష్యా-ఉక్రెయిన్ వివాదం వంటి కీలక అంశాలపై చర్చించనున్నాము."
-రిషి సునాక్, బ్రిటన్ ప్రధాన మంత్రి
మరోసారి పుతిన్ విఫలమయ్యాడు : సునాక్
Rishi Sunak G20 Summit :జీ20 సదస్సుకు హాజరుకావడం లేదంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ప్రకటనపై స్పందించారు రిషి సునాక్. "పుతిన్ మరోసారి ప్రపంచ దేశాల ముందు తన ముఖం చూపించడంలో విఫలమయ్యారు. ఆయన తన స్వార్థం కోసం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు" అని సునాక్ ఆరోపించారు. ప్రస్తుతం జరగనున్న జీ20 సదస్సుతో పుతిన్ 'విధ్వంసక మూకలను, కుయుక్తల'ను తిప్పికొడతామని బ్రిటన్ ప్రధాని స్పష్టం చేశారు.
భారత్‌కు దేశాధినేతలు..!
Foreign Ministers Visit To India G20 Summit : భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇతర దేశాధినేతలు కూడా ఒక్కొక్కరుగా దిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఏంజెల్ ఫెర్నాండెజ్ దిల్లీ చేరుకున్నారు. ఫెర్నాండెజ్‌కు కేంద్ర సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వాగతం పలికారు. జీ-20 సమావేశాల నేపథ్యంలో జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషీదా కూడా భారత్‌లో అడుగుపెట్టారు.
జీ-20 సమావేశంలో పాల్గొనేందుకు దిల్లీకి చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఘన స్వాగతం పలికారు కేంద్రమంత్రి దర్శనా జర్దోష్. సాంస్కృతిక నృత్యాలతో బంగ్లా ప్రధానికి ఆహ్వానం పలికారు. అలాగే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి కూడా ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో సాంస్కృత్రిక ప్రదర్శనలతో మెలోనికి కేంద్ర సహాయమంత్రి శోభా కరంద్లాజే ఆహ్వానం పలికారు.
జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ WTO డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ OECD సెక్రటరీ జనరల్ మథియాస్ కోర్మాన్ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. మెక్సికో ఆర్థిక మంత్రి రాక్వెల్ బ్యూన్‌రోస్ట్రో సాంచెజ్ కూడా భారత్‌కు విచ్చేశారు. జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ సాదరంగా స్వాగతం పలికారు.