దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి...ఆర్-ఫ్యాక్టర్ ఆందోళనకరంగా మారింది...అనేక రాష్ట్రాల్లో వైరస్ విజృంభిస్తోంది....మూడోవేవ్ మొదలైపోయినట్టే... ఇవీ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు. వీటిని చూసి మీరూ భయపడుతున్నారా? ఆ అవసరం లేదు. అతిగా ఆందోళన చెందకుండా.. మాస్కు ధరించి, వ్యాక్సిన్ వేయించుకుంటే సరి!
ఇది మేం చెప్పే మాట కాదు.. నిపుణులే స్వయంగా చెబుతున్నారు. కరోనా మూడో వేవ్ ప్రారంభమైందని ఇప్పుడే చెప్పేయడం సరికాదని దేశంలో కరోనా వ్యాప్తిని గమనిస్తున్న నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండో దశ వ్యాప్తే ఇంకా ముగియలేదని గుర్తు చేస్తున్నారు. దిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వైరస్ కేసులు తగ్గిపోయాయని హరియాణాలోని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ గౌతమ్ మేనన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త వేవ్ ప్రారంభం కన్నా.. రెండో వేవ్ కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
"కేసులు పెరుగుతున్నప్పటికీ.. మూడోవేవ్ ఇప్పుడే మొదలైందని చెప్పడం తొందరపాటు అవుతుంది. రానున్న కొద్ది వారాలు చాలా కీలకం. కేసుల పెరుగుదల ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమవుతుందా లేదా దేశవ్యాప్తంగా ఉంటుందా అనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. కేరళ సెరో సర్వేను గమనిస్తే.. రాష్ట్రంలోని అనేక మందికి వైరస్ ముప్పు ఉందని స్పష్టమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు."
-గౌతమ్ మేనన్, శాస్త్రవేత్త
ఐసీఎంఆర్ నిర్వహించిన నాలుగో సెరో సర్వేలో.. యాంటీబాడీలు అత్యల్పంగా ఉన్న రాష్ట్రం కేరళ అని తేలింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 79 శాతం నమూనాల్లో యాంటీబాడీలు కనిపించగా.. కేరళలో ఈ సంఖ్య 44 శాతంగా ఉంది.
మూడో వేవ్ రాకపోవచ్చు!
యూపీ, బిహార్ సహా జనాభా అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే మెజారిటీ జనాభాకు కరోనా సోకిందని మేనన్ తెలిపారు. ఈ నేపథ్యంలో వైరస్ విజృంభణ నెమ్మదిస్తుందని అంచనా వేశారు. కాబట్టి, దేశవ్యాప్తంగా మరో వేవ్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఒకవేళ వచ్చినా.. భీతావహం కలిగించిన రెండో వేవ్ తరహాలో ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ పరిమిత స్థాయిలోనే జరుగుతోందని, అయినప్పటికీ కేసులు తగ్గడంలో టీకాల పాత్ర కూడా ఉంటుందని వివరించారు.
ఆర్ వ్యాల్యూ సంగతి..?
కరోనా వ్యాప్తిని సూచించే ఆర్ వ్యాల్యూ మే 7 తర్వాత తొలిసారి ఒకటి దాటిందని చెన్నైలోని మేథమెటికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్ వ్యాల్యూ ఒకటి కన్నా ఎక్కువగా ఉందని కేంద్రం సైతం వెల్లడించింది. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, దిల్లీ నగరాల్లోనూ ఆర్ వ్యాల్యూ 1 దాటిందని మేథమెటికల్ సైన్సెస్‌కు చెందిన సీతభ్ర సిన్హా పేర్కొన్నారు. ఒకే ప్రాంతం నుంచి అధికంగా కేసులు నమోదు కావడం లేదని.. అందువల్ల కట్టడి చేయడం కష్టమవుతోందని తెలిపారు. కరోనా నిబంధనలు సరిగ్గా అమలు చేయడమే ఇందుకు పరిష్కారమని మరో నిపుణుడు చంద్రకాంత్ లహారియా పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఎనిమిది రాష్ట్రాల్లో ఆందోళనకరంగా కరోనా ఆర్-ఫ్యాక్టర్!