Maharashtra covid cases: మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. నిన్న, మొన్నటి వరకు స్థిరంగా నమోదైన కేసులు బుధవారం ఒక్కసారిగా ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. కొత్తగా 1,081 కేసులు వెలుగుచూశాయి. గత మూడు నెలల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ముంబయి, పుణె, ఠాణెలోని పలు ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలో బుధవారం నాటికి 3,475 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. అందులో దాదాపు 2,500 కేసులు ముంబయి ప్రాంతానికే చెందినవని ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపె చెప్పారు. అయితే కరోనా వల్ల ఒక్కరు కూడా ఆస్పత్రిలో చేరలేదని, అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
Covid 19 India: దేశంలో కొద్ది నెలలుగా కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 2000 నుంచి 3000 మధ్యే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ సంఖ్య మారే అవకాశం ఉంది. కరోనా మొదటి, రెండో దశల్లోనూ మహారాష్ట్రనే తీవ్రంగా ప్రభావితమైంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఆ రాష్ట్రానివే సగం ఉండేవి. ఇప్పుడు మళ్లీ అక్కడ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గించే విషయమే. అయితే గతంలోలా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకపోవడం ఊరటనిచ్చే అంశం. చిన్నారులు, వయోజనులు సహా అందరు టీకాలు తీసుకొని ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగింది. కరోనా వచ్చినా స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయి. పెద్దగా ఇబ్బంది లేకుండానే నయం అవుతోంది.