తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా?'.. హిజాబ్​ కేసులో సుప్రీం వ్యాఖ్యలు

కర్ణాటక పాఠశాలల్లో హిజాబ్​ ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా అని హిజాబ్​ కేసులో న్యాయవాదిని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

supreme court on hijab row
supreme court on hijab row

By

Published : Sep 8, 2022, 6:57 AM IST

Updated : Sep 8, 2022, 7:29 AM IST

Supreme Court On Hijab: దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా అని సుప్రీం కోర్టు కర్ణాటక పాఠశాలల్లో హిజాబ్‌ ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా బుధవారం వ్యాఖ్యానించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) ప్రకారం గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని వాదించారు. ఇందుకు స్పందిస్తూ జస్టిస్‌ హేమంత్‌ గుప్తా.. జస్టిస్‌ సుధాంశు ధూలియా ద్విసభ్య ధర్మాసనం ఈ వాఖ్యలు చేసింది. అయితే పాఠశాలల్లో ఎవరూ దుస్తులు విప్పడం లేదని న్యాయవాది సమాధానం చెప్పారు.

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని తొలగించడానికి నిరాకరిస్తూ కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం ధర్మాసనం వాదనలు ఆలకించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరుఫు న్యాయవాది దేవదత్త్‌ కామత్‌.. కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులు.. రాజ్యాంగంలోని 19, 21, 25 అధికరణల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొన్నారు. ముస్లిం బాలికలు తలపై వస్త్రం కప్పుకోవటానికి అనుమతినిస్తూ కేంద్రీయ విద్యాలయాలు జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. "ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.. హిజాబ్‌ను ఎవరూ నిషేధించలేదు. మీరు దాన్ని మీకు కావాల్సిన చోట ధరించవచ్చు. పాఠశాలలో మాత్రమే ఆంక్షలు విధించారు" అని పేర్కొంది. పాఠశాల దుస్తుల నిబంధనను ఓ వర్గం పాటించకపోవడంతో సమస్య తలెత్తిందని తెలిపింది. ఓ వర్గాన్ని దృష్టిలో ఉంచుకొనే హిజాబ్‌ నిషేధ ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ కామత్‌ చేసిన వాదనపై ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. "ఇది సరైంది కాకపోవచ్చు. ఎందుకంటే ఒక వర్గమే తలపై వస్త్రం కప్పుకొని రావాలనుకుంటోంది. మరో వర్గం పాఠశాల దుస్తుల నిబంధనను పాటిస్తోంది" అని తెలిపింది. విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.

Last Updated : Sep 8, 2022, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details