ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఉదంతంపై ఉద్యమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్ష పాత్ర వేగంగా బలోపేతం అవుతుందని అశపెట్టుకోవడం తొందరపాటు అవుతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishor Congress) హెచ్చరించారు. అంతర్గతంగా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ పునరుత్థానం సాధించలేదని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.
పార్టీ వేళ్లూనుకున్న సమస్యలను ఇప్పటికిప్పుడు అధిగమించడం అంతతేలిక కాదని ప్రశాంత్ కిశోర్(Prashant Kishor Congress) స్పష్టంచేశారు. సోనియా కుటుంబంతో మంతనాలు జరుపుతున్న ఆయన త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లఖింపుర్ ఖేరి ఉదంతంపై ప్రశాంత్ తాజా ట్వీట్‌ను చూస్తే, ఆయనకూ, కాంగ్రెస్ అగ్రనేతల కుటుంబానికీ మధ్య సంబంధాలు సజావుగా లేవన్న అనుమానాలు కలుగుతున్నాయి.
'లాభనష్టాలు వెతకడం నేరం'
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై(Prashant Kishor Congress) కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. లఖింపుర్ ఖేరి ఘటన వంటి సున్నితమైన అంశాల్లో లాభనష్టాలను వెతుక్కోవడం నేరమని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా.. మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
"రాజకీయ సలహాదారుల వ్యాఖ్యలపై నేను ఏం స్పందించాలనుకోవడం లేదు. అయితే.. లఖింపుర్ ఘటన వంటి వాటిలో లాభనష్టాల కోసం వెతకడం అంటే.. పెద్ద నేరం చేసినట్లే. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలపైన నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను. కానీ, రాజకీయ పార్టీలు ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని కోరుతున్నాను" అని సుర్జేవాలా తెలిపారు.