Richest MLA In India 2023 : సాధారణంగా రాజకీయ నాయకులకు ఉన్న ఆస్తుల విలువెంతో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఆసక్తే. రాజకీయాల్లోకి రాకముందు కాస్త పేదవాడైనా.. తర్వాత రోజుల్లో కోట్లకు పడగలెత్తిన నాయకులెందరో మన దేశంలో ఉన్నారు. తాజాగా 2023లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ధనిక, పేద ఎమ్మెల్యేల జాబితాను అధ్యయనం చేసింది అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బృందం. దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యేకి రూ.1,400 కోట్లు, అత్యంత పేద ఎమ్మెల్యేకి రూ.2000 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు వెల్లడించింది..
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అత్యంత ధనిక ఎమ్మెల్యే కాగా, బంగాల్‌కు చెందిన నిర్మల్‌కుమార్ ధారా అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా.. ఆ జాబితాలో నిలిచారు. తొలి 10 మంది ధనిక ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, ముగ్గురు బీజేపీ నేతలున్నారు.
ఆస్తులన్నీ ఒక్కసారిగా వచ్చిపడిపోలేదు: డీకే
Richest MLA DK Shivakumar : అయితే దీనిపై శివకుమార్ స్పందించారు. తాను ధనికుడిని కాదని, అలాగని పేదవాడిని కూడా కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తనకున్న ఆస్తులన్నీ ఒక్కసారిగా వచ్చిపడిపోలేదని, సుదీర్ఘకాలం కష్టపడి సంపాదించుకున్నవని ఆయన వ్యాఖ్యానించారు. కొందరు తమ ఆస్తులను వివిధ వ్యక్తుల పేరిట రాసుకుంటారని, తనకి అలా ఇష్టం ఉండదని చెప్పారు. అందుకే తన పేరిట ఇన్ని ఆస్తులు ఉన్నట్లు చెప్పారు.
డీకే శివకుమార్ తర్వాత రూ.1,267 కోట్ల విలువైన ఆస్తులతో గౌరిబిదనూర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రియకృష్ణ రూ.1,156 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. కర్ణాటక ఎమ్మెల్యేలలో అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యే బీజేపీకి చెందిన భాగీరథి మురుల్య. ఆయనకు రూ. 28లక్షల విలువైన ఆస్తులు, రూ. 2 లక్షల అప్పులు ఉన్నాయి.
Top 20 Richest MLAS : మరోవైపు దేశ వ్యాప్తంగా తొలి 20 మంది ధనిక ఎమ్మెల్యేల్లో 12 మంది కాంగ్రెస్ నుంచే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ధనికులకే న్యాయం చేస్తుందని, తన పార్టీలోనూ వాళ్లకే స్థానం కేటాయిస్తుందని విమర్శించింది. మరోవైపు కర్ణాటకలోని 14శాతం మంది ఎమ్మెల్యేలు ధనికులేనని, వారి వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైమాటేనని అధ్యయనం పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 59 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కోటీశ్వరులు ఉన్నారు.