బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. పాక్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంపై ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను.. రీట్వీట్ చేస్తూ ఆమె పెట్టిన సందేశం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు.. పాక్ ఆక్రమిత ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం సిద్ధంగా ఉంటుందని నార్తర్న్‌ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యలను ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను కోట్ చేసిన నటి రిచా చద్దా.. 'గల్వాన్ సేస్ హాయ్' అంటూ రీట్వీట్ చేశారు. ఇది దుమారానికి దారితీసింది. సైన్యాన్ని కించపరిచేలా నటి ట్వీట్ ఉందని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు.
రిచా చేసిన ట్వీట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఆమె ట్వీట్‌పై భాజపా.. శివసేన పార్టీలు మండిపడ్డాయి. ఆర్మీని అవహేళన చేసేలా వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ విమర్శించారు. ట్వీట్‌లో గల్వాన్ ప్రస్తావన తెచ్చి జోక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని నళిన్ కోహ్లీ కోరారు. మరో భాజపా నాయకుడు.. మంజిత్ సింగ్ సిర్సా కూడా నటి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సైన్యాన్ని అవమానించటం.. సమర్థనీయం కాదని మండిపడ్డారు. అటు శివసేన సైతం.. నటి ట్వీట్‌పై ఘాటుగా స్పందించింది. ఈ తరహా దేశ వ్యతిరేక పోస్టులు చేసే వారిపై.. నిషేధం విధించాలని డిమాండ్ చేసింది.