Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో తొలిదశ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2022 జనవరిలో 10 వేల 911 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అంచనాలు సమర్పించినా అవి కొలిక్కి రాలేదు. మళ్లీ తాజాగా తొలిదశ అంచనాలు సమర్పించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ కోరిన మేరకు మే ప్రారంభంలో కేంద్రానికి నివేదిక పంపారు. కొత్తగా పంపిన నివేదికలో అంచనాలు ఒక్కసారిగా 16వేల 952 కోట్లకు చేరిపోయాయి. ఏడాదిన్నర కాలంలో కొన్ని అదనపు పనులు, కొంత అదనపు భూసేకరణ, పునరావాసంతో ఈ అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఒకవైపు పోలవరానికి నిధులు సాధించడంలో జగన్ సర్కార్ సాధించింది ఏమీ లేకపోగా.. మరోవైపు ఎప్పటికప్పుడు కొత్త అంచనాలు అంటూ సాగుతున్న ప్రహసనంలో అంకెలు మారిపోతూ వస్తున్నాయి. కేంద్రజల్ శక్తిశాఖ మంత్రి షెకావత్ ఆధ్వర్యంలో నేడు దిల్లీలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. తొలిదశ అంచనాలపైనా కేంద్రమంత్రి చర్చించనున్నారని సమాచారం. పోలవరం నిధులకు సంబంధించి నాలుగు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వంలో సాగుతున్న ప్రహసనం కొలిక్కి వచ్చేనా? లేదంటే మళ్లీ పెండింగ్‌లో పడుతుందా అనేది నేడు తెలియనుంది.
పోలవరంపై దిల్లీకి అఖిలపక్షం.. రాష్ట్రప్రభుత్వంపై వత్తిడి దిశగా రౌండ్‌టేబుల్ సమావేశం
పోలవరం ప్రాజెక్టులో తొలిదశ నిధులు ఇవ్వడంపైనే పెద్దఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారుల్లోనే ఈ తొలిదశ ప్రహసనంపై సందేహాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు 2017-18 ధరలతో సుమారు 55 వేల కోట్లతో సవరించిన అంచనాలను రెండో డీపీఆర్‌గా సమర్పించారు. అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం అనేక ప్రశ్నలను లేవనెత్తితే నెలల తరబడి అధికారులు దిల్లీలో ఉండి సందేహాలను నివృత్తి చేశారు.
ఆ అంచనాల్ని పరిశీలించన కేంద్ర జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ 2019 ఫిబ్రవరిలో.. సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపింది. సాంకేతిక సలహా కమిటీ ఆమోదం పొందిందంటే డీపీఆర్-2 కొలిక్కి వచ్చినట్లుగానే భావించాలి. అలాంటిది జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాంకేతిక సలహా కమిటీ ఆమోదం పొందిన అంచనాలపై రివైజ్డు కాస్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. వారు అధ్యయనం చేసి 47వేల 725 కోట్లకు ఆమోదం తెలిపారు. ఆ ప్రతిపాదనను కేంద్రజల్ శక్తి శాఖ ఆమోదించి ఆర్థికశాఖకు పంపాక, కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందితే డీపీఆర్- 2 కింద నిధులు ఇచ్చే ఆస్కారం ఉంది.
అయితే సీఎం జగన్ ఆ డీపీఆర్‌పై పోరాడి నిధులు సాధించుకోలేక పోయింది. వాస్తవానికి డీపీఆర్‌ను ఆమోదించి తొలిదశగా కొన్ని నిధులివ్వొచ్చు. ఆ తర్వాత రెండో దశ కింద మిగిలిన నిధులిచ్చే అవకాశం ఉంది. కానీ కేంద్రం మాత్రం 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేస్తే ఎంత ఖర్చవుతుందో ఆ మొత్తం తొలిదశగా అంచనాలు తయారు చేసి పంపాలని కోరింది. జగన్ సర్కార్ సైతం ఆదే కోణంలో ముందుకు వెళ్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అనేక ఏళ్ల పాటు పోలవరం డీపీఆర్- 2పై కసరత్తు చేసి రెండు కీలక కమిటీలు ఆమోదం తెలిపాక అది పక్కన పెట్టి మళ్లీ రెండేళ్లుగా తొలిదశ నిధులంటూ ప్రహసనం సాగడం సందేహాలకు తావిస్తోంది.
Polavaram Project: జగన్ హయాంలో "పోలవరం అట్టర్ ఫ్లాప్".. ఆ మాటలే నేడు నిజమైన వైనం..!