Revenue From Tatkal: మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా రైల్వేకు భారీగానే ఆదాయం సమకూరింది. 2020-21 సంవత్సరంలో రైల్వే.. తత్కాల్, ప్రీమియం తత్కాల్, డైనమిక్ ఛార్జీలతో కలిపి మొత్తం రూ.1033 కోట్లు వసూలు చేసింది. వీటిలో తత్కాల్ టికెట్ల ద్వారా రూ. 403 కోట్లు, ప్రీమియం తత్కాల్ ద్వారా రూ. 119 కోట్లు, డైనమిక్ ఛార్జీలకు రూ.511 కోట్లు వచ్చాయి. రైల్వే ఆదాయంపై మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు స్పందిస్తూ రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది.
గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలోనే తత్కాల్ టికెట్ల ద్వారా రూ.353 కోట్లు, ప్రీమియం తత్కాల్ ద్వారా రూ.89 కోట్లు, డైనమిక్ ఫేర్స్ ద్వారా రూ.240 కోట్లు వచ్చినట్లు రైల్వే వెల్లడించింది. ఎలాంటి ఆంక్షలు లేని 2019-20 ఆర్థిక సంవత్సరంలో తత్కాల్, ప్రీమియం తత్కాల్, డైనమిక్ ఫేర్స్ ద్వారా రూ. 3585 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది.