ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారానగర్ పంచాయతీ పరిధిలోని గంగానదిలో మృతదేహాలను పారేస్తూ మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. దీనిపై 'ఈటీవీ భారత్' అతడిని ప్రశ్నించగా... స్థానిక పోలీసులే తనని ఈ పని చేయమన్నారని వెల్లడించడం గమనార్హం. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను పారవేసినట్లు చెప్పాడు. నదిలో మరెన్నో మృతదేహాలను పారవేయమని పోలీసులు తనని ఆదేశించినట్లు వివరించాడు. అతడి వివరాలు అడగ్గా.. తన పేరు బిహారి సా అని.. నాన్న పేరు దెహారి అని చెప్పుకొచ్చాడు.
ఘటనాస్థలి నుంచి మీడియా వెళ్లిన వెంటనే మరిన్ని శవాలను నదిలో పారవేస్తానని చెప్పాడు. బిహార్‌లోని బక్సర్ జిల్లాలో గంగా నది ఒడ్డున పెద్దఎత్తున మృతదేహాలు బయటపడ్డాయి. అవి కొవిడ్‌తో మరణించిన వారివి అనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ఘటనే బారానగర్‌లో జరగడం వల్ల స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
బక్సర్ ఘటనపై అక్కడి కలెక్టర్ వివరణ ఇచ్చారు. శవాలను కాల్చడానికి కట్టెలు లేక, ఆర్థిక సమస్యలతో పేదలు అంత్యక్రియలు చేయలేక ఇలా పడేశారని తెలిపారు. అలా చేయడం తప్పు అని ఆయన చెప్పారు.