Revanth Reddy Oath as Chief Minister in Telangana :రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. సీఎం అధికారికంగా ప్రకటన పూర్తికావడంతో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 10గంటల 28నిమిషాలకు రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సీఎంతో పాటు 9 నుంచి 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణ పరిపాలన శాఖ అధికారులతో కలిసి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ సహా పార్టీలోని సీనియర్ నేతలు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసి ప్రమాణ స్వీకారానికి(Telangana CM Oath Ceremony) సంబంధించి సమాచారం ఇచ్చారు. స్టేజి ఏర్పాటుతో పాటు ఎక్కడెక్కడ ప్రవేశ ద్వారాలు ఉండాలి, ఎంతమందిని అనుమతించవచ్చు తదితర అంశాలపై అధికారులతో సమాలోచనలు చేశారు.
ఉత్కంఠ వీడింది, ఊహించిందే జరిగింది - రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పగ్గాలు
"తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మేరకు రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో లక్షల సంఖ్యలో అభిమానులు రానున్నారు. దీనికి అనుగుణంగా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడానికి పరిశీలించేందుకు ఎల్బీ స్టేడియంకు వచ్చాం."- మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
Telangana CM Revanth Reddy Celebrations :రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రావడంతో దొరల రాజ్యం పోయి ప్రజల రాజ్యం వచ్చిందని ప్రజలంతా మరోసారి దీపావళి జరుపుకోవాలని సీనియర్ నేత మల్లు రవి పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం రేవంత్‌ని సీఎంగా ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు(Congress Leaders Celebrations) అంబరాన్నంటాయి. రేవంత్‌రెడ్డి సొంత జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పార్టీ శ్రేణులు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. రేవంత్ హయాంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.