Revanth Reddy Fires on Etela : మునుగోడు ఉపఎన్నికల్లో రేవంత్‌రెడ్డి డబ్బులు తీసుకున్నారని నిన్న ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇవాళ చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ఈటల వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తుది శ్వాస విడిచే వరకు కేసీఆర్‌తో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై పోరాటం చేసింది తానేనని పేర్కొన్నారు. చర్లపల్లి జైల్లో కేసీఆర్ నిర్భందించినా భయపడలేదని.. కేసీఆర్‌తో కొట్లాడుతున్న తమపై నిందలా అని ప్రశ్నించారు.
"కేసీఆర్‌తో లాలూచీ నా రక్తంలోనే లేదు. కేసీఆర్ వద్ద డబ్బు తీసుకుంటే ఆయన కళ్లల్లో చూసి మాట్లాడేవాడినా? నా నిజాయతీని శంకించడం మంచిది కాదు.నా కళ్లలో నీళ్లు రప్పించావు. కేసీఆర్ సర్వం దారబోసినా రేవంత్‌రెడ్డిని కొనలేరు. ప్రశ్నించే గొంతుపై దాడి చేస్తే కేసీఆర్‌కు మద్దతు ఇచ్చినట్టే. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడటమంటే ఇదేనా రాజేంద్ర"- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
దేవునిపై విశ్వాసం ఉంటే ఈటల మాటలు ఉపసంహరించుకోవాలి:మునుగోడు ఉప ఎన్నిక పరిణామాలు అందరికీ తెలుసని వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి.. ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ భారీగా డబ్బులు ఖర్చు చేశాయని ఆరోపించారు. తాము డబ్బు, మద్యం పంచకుండా ఓట్లు అడిగామని తెలిపారు. అమ్మవారిని నమ్ముతాను కాబట్టే ప్రమాణం చేశానన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తన ఏకైక లక్ష్యంగా చెప్పుకొచ్చారు. దేవునిపై విశ్వాసం ఉంటే ఈటల తన మాటలు ఉపసంహరించుకోవాలన్నారు.
"ఈటల.. కేసీఆర్ ముసుగు వేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఈటల ఆరోపణ నా మనోవేదనను దెబ్బతీసేలా ఉంది. తుదిశ్వాస విడిచే వరకు కేసీఆర్‌తో రాజీపడే ప్రసక్తే లేదు. నేను హిందువును. దేవుడిని నమ్ముతాను. అమ్మవారిని నమ్ముతాను కాబట్టే ప్రమాణం చేసేందుకు వచ్చాను. దేవునిపై విశ్వాసం ఉంటే ఈటల తన మాటలు ఉపసంహరించుకోవాలి. నేను అమ్ముడుపోయుంటే ప్రజల గుండెల్లో ఉండేవాడిని కాదు. ఎవరు గద్దెనెక్కుతారో.. ఎవరు గద్దె దిగుతారో కాలమే నిర్ణయిస్తుంది"- రేవంత్‌రెడ్డి