Revanth Reddy as Telangana CM : శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల కసరత్తుల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపిక చేసింది. ఈ నెల 3న ఫలితాలు వెలువడిన వెంటనే అప్రమత్తమైన అధిష్ఠానం, గెలిచిన 64 మంది పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు తరలించింది. మరుసటి రోజు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఎంపికపై సుదీర్ఘంగా చర్చించగా, ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై చర్చలు కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో సీఎల్పీ ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికే వదిలి పెట్టాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయానికి కట్టుబడాలని చేసిన ఏక వాక్య తీర్మానానికి ఎమ్మెల్యేలు ఆమోదించారు.
ముఖ్యమంత్రిగా రేవంత్‌వైపే రాహుల్ మొగ్గు
Congress High Command Announced Revanth Reddy as Telangana CM : రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ, ఎమ్మెల్యేల తీర్మానంతో దిల్లీ వెళ్లిన ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్, మాణిక్‌రావ్ ఠాక్రే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై చర్చించారు. ఈ కీలక భేటీలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రిగా రేవంత్ పేరునే రాహుల్ గాంధీ సూచించగా, ఈ భేటీ అనంతరం తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు దిల్లీ వచ్చిన ఉత్తమ్, భట్టిలతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు. ఈ నెల ఏడో తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు.