Seema Patra BJP : తన ఇంట్లో పనిచేసే మహిళను అతి దారుణంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన భాజపా నాయకురాలు సీమా పాత్రాను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీమా ఇంట్లో పనిచేసే సునీత శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సీమా పాత్రా తనను బంధించి తీవ్రంగా హింసించారని సునీత ఆ వీడియోలో వాపోయింది. కొన్ని సార్లు ఇనుప రాడ్లతో కొట్టేవారని, అలా ఓసారి తన పన్ను కూడా విరిగిపోయిందని తెలిపింది.
29 ఏళ్ల సునీత కొన్నేళ్ల క్రితం రాంచీలోని అశోక్‌నగర్ ప్రాంతంలో గల సీమా పాత్ర నివాసంలో పనికి చేరింది. సునీతను సీమా చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు స్థానికులు కొందరు సమాచారమివ్వడంతో గతవారం పోలీసులు ఆమెను రక్షించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి సీమా పాత్ర పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. రోడ్డు మార్గంలో రాంచీ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఈ తెల్లవారుజామున పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.