Retired Commander Inder Singh Died :1971 పాకిస్థాన్‌తో యుద్ధం గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ కమాండర్ ఇందర్ సింగ్ కన్నుమూశారు. పాకిస్థాన్‌కు చెందిన గాజీ సబ్‌మెరైన్ ముంచిన ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌కు కమాండర్‌గా వ్యవహరించారు ఇందర్ సింగ్. 99 ఏళ్ల వయసున్న ఆయన.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం క్షీణించడం వల్ల.. హరియాణ రోహ్తక్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం షీలా బైపాస్ రోడ్డులోని శ్మశాన వాటికలో నిర్వహిస్తామని కుటుంబసభ్యులు చెప్పారు.
సూపర్ ప్లాన్‌తో పాకిస్థాన్ సబ్‌మెరైన్ నాశనం
India Pakistan War 1971 : 1971లో యుద్ధం ప్రారంభమైన సమయంలో డిసెంబర్ 3న భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ముంచేందుకు గాజీ సబ్‌మెరైన్‌ను పంపించింది పాకిస్థాన్. వాస్తవానికి ఈ గాజీ సబ్‌మెరైన్‌ను అమెరికా నుంచి లీజుకు తీసుకుంది పాకిస్థాన్. అప్పటికి భారత్ వద్ద ఒక్క జలాంతర్గామి కూడా లేదు. దీనిని భగ్నం చేసేందుకు సూపర్ ప్లాన్ వేసింది భారత్. విశాఖపట్నంలో ఉన్న ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌ను పాకిస్థాన్ గాజీ సబ్‌మెరైన్ వస్తున్న.. పశ్చిమ భాగానికి తరలించింది. పాకిస్థాన్ దృష్టిని మరల్చేందుకు.. ఐఎన్ఎస్ విక్రాంత్‌గా కనిపించింది. పాకిస్థాన్ గాజీ సబ్‌మెరైన్‌ను గమనించిన ఐఎన్ఎస్ రాజ్‌పుత్ కమాండర్ ఇందర్ సింగ్.. దానిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య జరిగిన యుద్ధంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో పాకిస్థాన్‌కు చెందిన గాజీ సబ్‌మెరైన్ మునిగిపోయింది.