తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పురపోరులో భాజపా జయభేరి- 483 స్థానాల్లో గెలుపు

గుజరాత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాజపా సత్తా చాటింది. మొత్తం ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా అన్నిచోట్లా విజయం సాధించింది. అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదరా, రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌, భావ్‌ నగర్‌ కార్పొరేషన్లలో మెుత్తం 576 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా 483 డివిజన్లను భాజపా కైవసం చేసుకుంది.

Results of Gujarat civic polls
గుజరాత్​ పురపోరులో భాజపా జయభేరి

By

Published : Feb 24, 2021, 5:43 AM IST

గుజరాత్​పై తన పట్టును భాజపా మరోసారి నిరూపించుకుంది. నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 576 స్థానాలకు గాను ఏకంగా 483 చోట్ల విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్​ కేవలం 55 స్థానాలకే పరిమితమైంది. సూరత్​లో ఖాతా కూడా తెరవలేకపోయింది.

అహ్మదాబాద్, రాజ్​కోట్, జామ్​నగర్, భావ్​నగర్, వడోదరా, సూరత్​ నగరపాలక సంస్థల ఎన్నికలు ఈ నెల 21న జరిగాయి. ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. కమల దళానికి అహ్మదాబాద్​లో మొత్తం 192 స్థానాలకుగాను 159, రాజ్​కోట్​లో 72 సీట్లకుగాను 68, జామ్​నగర్​లో 64 స్థానాలకు గాను 50, భావ్​నగర్​లో 52 సీట్లకు గాను 44, వడోదరాలో 76 స్థానాలకుగాను 69, సూరత్​లో 120 స్థానాలకుగాను 93 దక్కాయి.

ఆప్​ శెభాష్​!

తొలిసారి ఈ ఎన్నికల బరిలో నిలిచిన ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) మంచి ఫలితాలు రాబట్టింది. 27 సీట్లను గెలుచుకుంది. అవన్నీ సూరత్​లోనివే. తద్వారా సూరత్​లో ఆప్​ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. తొలిసారిగా గుజరాత్​ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన ఏఐఎంఐఎం అహ్మదాబాద్​లో ఏడు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.

ప్రధాని, షా హర్షం..

గుజరాత్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో భాజపా జయభేరీ మోగించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తాజా ఫలితాలు చాటిచెప్తున్నాయని వ్యాఖ్యానించారు. విజయంపై సీఎం విజయ్​ రూపానీని అమిత్​ షా అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details