modi deve gowda: లోక్‌సభకు రాజీనామా చేయాలన్న తన కోరికను తిరస్కరించడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీపై గౌరవం ఎన్నో రెట్లు పెరిగిందన్నారు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ. 276 సీట్లు గెలిచి భాజపా సొంతంగా అధికారంలోకి వస్తే తాను లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీకి సవాల్ విసిరినట్లు గౌడ గుర్తుచేసుకున్నారు.
"భాజపా 276 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని నేను చెప్పాను. ఇతరులతో పొత్తు పెట్టుకుని మీరు అధికారంలోకి రావొచ్చు. కానీ సొంతంగా 276 స్థానాలు గెలిస్తే నేను (లోక్‌సభకు) రాజీనామా చేస్తాను" అని గౌడ ఒక ప్రకటనలో అన్నారు.
అయితే ఆ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించి సొంతంగానే అధికారం చేపట్టడం వల్ల తన సవాల్ నిలబెట్టుకోవాలని భావించినట్లు దేవె గౌడ వెల్లడించారు. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని మోదీ స్వయంగా ఆహ్వానించారని చెప్పారు. వేడుకలు ముగిసిన తర్వాత మోదీతో వ్యక్తిగతంగా కలిసి రాజీనామా చేస్తానని అన్నట్లు గౌడ తెలిపారు.