తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నది నిండింది.. వాళ్లలో ఆనందం పొంగింది

నీరు లేక భారంగా గడిపిన ఊర్లవి. సేద్యం చేయలేక, బతుకుబండిని లాగలేక, ఉపాధిని వెదుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు వాళ్లు. ఊర్లకు సమీపంలోనే నది ఉన్నా.. తాగు, సాగు నీటికి వెతలు తప్పలేదు వారికి. ఏళ్ల తరబడి ఈ సమస్యలతో ఉక్కిరిబిక్కిరైన 11 గ్రామాల ప్రజలు.. స్వయంగా సమస్యను పరిష్కరించుకున్నారు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..

villages
సేద్యం

By

Published : Apr 1, 2021, 9:53 AM IST

ఇందోర్- ఖండ్‌వా రహదారికి సమపంలోని సిమ్రోల్‌ ప్రాంతంలో ఉన్న 11 గ్రామాల ప్రజలు సమష్టిగా నీటికష్టాల నుంచి గట్టెక్కారు. వందలాదిమంది నీటికోసం పోరాడి, సఫలీకృతమయ్యారు. బీడుబారిన భూముల్లో తిరిగి సేద్యం మొదలుపెట్టారు. ఉపాధి లేక అల్లాడిన ప్రజలంతా పుష్కలంగా నీరు లభిస్తుండడంతో వ్యవసాయం చేస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. తమ జీవితాల్లో ఒక్కసారిగా అనూహ్య మలుపు చోటుచేసుకుందంటున్న ఈ ప్రాంత ప్రజలది నిజంగా గొప్ప విజయమనే చెప్పుకోవాలి.

సుఖ్‌డీ నది నిండింది.. వాళ్లలో ఆనందం పొంగింది

బాయ్, శాండల్, మండల్, భేరుఘట్, గజిండా, లాల్‌పురా, తగ్‌డీపురా సహా.. చుట్టుపక్కల 11 గ్రామాల్లో ఒకప్పుడు తీవ్ర కరవు తాండవించింది. ఆ గ్రామాల ప్రజల జీవితాలు వానదేవుడి దయపై ఆధారపడి ఉండేవి. ఓ ఏడాదిలో సరిగా పంట పండితే అదే గొప్పగా భావించేవారు. సమీపంలోని సుఖ్‌డీ నదిపైనే వాళ్ల ఆశలన్నీ. నదిలో నీరుంటే సరే లేదంటే అంతే సంగతి. వేసవి కాలాల్లో సుఖ్‌డీ సహా.. సొంత అవసరాల కోసం తవ్వుకున్న కుంటలు పూర్తిగా ఎండిపోయేవి. ఆ గ్రామాల ప్రజల గొంతులు కూడా.

నీరు లేక, ఆ ప్రాంతమంతా బీడుభూమిలా మారిపోయింది. జంతువులకు తాగేందుకు నీరందించలేక సతమతమయ్యారు ఈ ప్రాంత ప్రజలు. నీటి సంక్షోభంతో అల్లాడిపోయారు. తమ సమస్యలను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు, స్థానికుల సంయుక్త కృషితో సుఖ్‌డీ నది తిరిగి జీవకళ సంతరించుకుంది. 9 కిలోమీటర్ల వ్యాసార్థంతో నది నిండుకుండలా మారింది.

"మొదట్లో, పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. నది అంతటా ప్రజలు గుంతలు తవ్వేవారు. నర్మదా లైను నుంచి నీళ్లొచ్చిన తర్వాత, ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనమే. అందరూ కనెక్షన్లు తీసుకున్నారు. 2వేల మీటర్ల దూరంలోని అందరికీ నీరు అందుబాటులో ఉందిప్పుడు. మేమే అంత దూరం పైపులైన్లు వేయించాం. గతంలో అయితే ఏడాదికి ఒక పంటే వేసేవాళ్లం. ఇప్పుడు రెండు సార్లు గోధుమలు పండిస్తున్నాం."

-రాల్కీ బాయి, స్థానికురాలు

"రాజీవ్ గాంధీ మిషన్‌ కింద్ 200 నుంచి 400 డ్యాంలు కట్టారు. కొండప్రాంతంలోని మురుగు నీటి కాలువలన్నీ బందైపోయాయి. మిగతాదంతా ప్రభుత్వమే చేసింది. మా ఊరి నుంచి మొదలుకుని, భైరుఘట్ వరకు 9 కిలోమీటర్ల నది విస్తరించి ఉంది. నర్మదా నది నుంచి నీటిని విడుదల చేసిన తర్వాత తాగునీటి అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు పుష్కలంగా నీరు లభిస్తోంది."

-రేవా సింగ్, స్థానికుడు

ప్రతిచోటా చిన్న చిన్న ఆనకట్టలు నిర్మించారు. అవన్నీ నర్మదా నదితో అనుసంధానించారు. రెండు నదులను కలపడం ద్వారా సుఖ్‌డీ నదికి పునర్వైభవం వచ్చినట్లైంది. ఇప్పుడా నదీ నిండుకుండలా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో వర్షాలు కురిసినా కురవకపోయినా పెద్ద తేడా ఉండదు. నర్మదా నది వల్ల 11 గ్రామాల్లోని ప్రజల నీటివెతలు తీరిపోయాయి. ప్రజలంతా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి సీజన్‌లో మూడు పంటలు పండుతున్నాయి. కూరగాయల వ్యాపారం కూడా సజావుగా సాగుతోంది. పశుసంపద కళకళలాడుతోంది.

"ఈ నదికి పునరుజ్జీవం తెచ్చే పనులు రెండు అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఒకటేమో ఐడబ్ల్యూఎంపీ, రెండోది రూరల్ మిషన్. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా నీటి నిర్వహణ పనులు చేపట్టాం. వర్షాకాలం ముగిసిన తర్వాత నీటి ప్రవాహం తగ్గితే..సేకరించిన నీటిని ఆనకట్టల్లో నిల్వ చేస్తాం. ఆ తర్వాత, వ్యర్థ జలాల ప్రవాహానికి వేరే మార్గం ఏర్పాటు చేశాం. ఫలితంగా నదిలోని నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. నీరు చిన్న చిన్న ఆనకట్టల్లో నిల్వ అవుతుంది. వచ్చే ఏడాది వరకూ పంటలకు సరిపడా నీరు లభిస్తుంది. వీటిలాగే మరిన్ని నదుల వద్ద నీటి షెడ్‌లు నిర్మించేందుకు ప్రాజెక్టులు చేపట్టనున్నాం. 2021-22 సంవత్సరానికి నదుల పునరభివృద్ధి పనులకు ప్రణాళికలు చేస్తున్నాం."

-హిమాన్షు చంద్ర, ఇందోర్ జిల్లా పంచాయతీ సీఈఓ

గ్రామస్థుల కృషి ఫలితంగా పరిసరాలన్నీ పచ్చదుప్పటి కప్పుకున్నాయి. వారి ఆదాయం కూడా పెరిగింది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వాళ్లంతా తిరిగి ఊరిబాట పట్టారు. వారి శ్రమకు అదృష్టం కూడా తోడవడంతో ప్రస్తుతం ప్రశాంతంగా బతుకుతున్నారు.

ఇదీ చదవండి:ఆ చట్టానికి పాతికేళ్లైనా.. అట్టడుగునే ఆదివాసులు!

ABOUT THE AUTHOR

...view details